హైదారాబాద్‌లో ఎన్ని సాయిబాబా దేవాలయాలు ఉన్నా.. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయానికి ఉన్న ప్రత్యేకతే వేరు. తాజాగా ఈ దేవాలయానికి మరో ఘనత సాధించింది. అయితే ఒక వస్తువు నాణ్యతను తెలుసుకోవడానికి అగ్‌మార్క్, ఐఎస్ఐ ముద్రల్లాంటివి ఉన్నట్లే.. కంపెనీలు, ట్రస్ట్‌ల నిర్వహణలో పాటించే ప్రమాణాలను చాటడానికి ఐఎస్ఓ సర్టిఫికెట్లను జారీ చేస్తారు. జెనీవాలోని ఇంటర్నేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండర్డైజేషన్ వీటిని అందిస్తోంది. పెద్ద ఎత్తున సేవలు అందించే సంస్థలకు సైతం ఐఎస్ఓ సర్టిఫికెట్లను జారీ చేస్తారు. అలా అనేక దేవాలయాలు కూడా ఐఎస్ఓ ధృవీకరణ పత్రాలను పొందుతున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ ఘనత పొందిన వాటిల్లో టీటీడీది మొదటి స్థానం. టీటీడీ ఆధ్వర్యంలో సేవలు అందించే వివిధ సంస్థలకు పెద్ద సంఖ్యలో ఐఎస్ఓ సర్టిఫికెట్లు జారీ అయ్యారు. ఆలయాల విషయంలో ఐఎస్ఓ సర్టిఫికెట్లు దక్కించుకున్న ఘనత మాత్రం తెలంగాణలోని యాదాద్రి పుణ్యక్షేత్రానిదే. ఆలయాన్ని అద్భుతమైన ప్రమాణాలతో నిర్వహించడంతో పాటుగా పర్యావరణ పరిరక్షణ, భద్రత, విద్యుత్ సరఫరా విభాగాల్లో మెరుగైన సదుపాయాలు అందిస్తున్నందుకు యాదాద్రి ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను సాధించింది.
దిల్‌సుఖ్ నగర్ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ ప్రమాణాలు, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడలేదు కాబట్టే అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. ముఖ్యంగా ప్రసాదాల తయారీలో శుభ్రతా నియమాలు కట్టుదిట్టంగా పాటిస్తుందనే ఘనత దక్కించుకుంది. నిజానికి ప్రసాదాల తయారీ అంటే అందరి మదిలో మెదిలేది తిరుమల లడ్డూనే. తిరుమల లడ్డూలో వాడే పదార్థాలు, తయారీ అంతా విభిన్నం.
అందుకే రుచితో పాటే ఆధరణ విషయంలో అందనంత ఎత్తులో ఉంటుంది తిరుమల లడ్డు. దిల్‌సుఖ్‌నగర్‌లో సాయిబాబా ఆలయం సైతం ప్రాసాదాల తయారీ విషయంలో ఇలాంటి ఉన్నత ప్రమాణాలనే పాటిస్తోంది. అందుకే ఎన్నో ప్రముఖ క్షేత్రాలు, ప్రఖ్యాత దేవాలయాల కన్నా ముందే ఐఎస్ఓ సర్టిఫికెట్‌ను సాధించింది. ఐఎస్ఓ గుర్తింపు అంటే.. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయ ప్రాఖ్యాతలు హైదరాబాద్, దేశం దాటి అంతర్జాతీయ స్థాయికి పెరిగినట్లే. అంతా సాయి మహిమ అన్నట్లుగా ఇప్పుడు దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా ఆలయ కీర్తిప్రతిష్టలు జగమంతా విస్తరించాయి.