బ్యాట్స్‌మెన్ 100 కంటే అశ్విన్ 50 ప్రత్యేకం: పార్థివ్ పటేల్

-

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డు సృష్టించారు. 2021 క్యాలెండర్ ఇయర్‌లో 50 టెస్టు వికెట్ల మైలురాయిని అధిగమించాడు. మూడో రోజు ఆటలో భాగంగా కివీస్ ఓపెనర్ విల్ యంగ్‌ను అవుట్ చేయడం ద్వారా ఈ ఘనతను అశ్విన్ సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 2021 సంవత్సరంలో అశ్విన్ ఖాతాలో 51 వికెట్లు ఉన్నాయి. అతడికి ఏడు వికెట్ల దూరంలో పాకిస్తాన్‌కు చెందిన షాహీన్ ఆఫ్రిది(44) ఉన్నారు.

క్యాలెండర్ ఇయర్‌లో 50 వికెట్ల మైలురాయిని అధిగమించినందుకు అశ్విన్‌ను మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ ప్రశంసించాడు. బ్యాట్స్‌మెన్ సాధించిన 100ల గురించి తరుచూ మాట్లాడుతుంటారు. కానీ, అశ్విన్ 50 కూడా ప్రత్యేకమే. టెస్టు క్రికెట్‌లో ఒకే ఏడాదిలో ఏ భారతీయ క్రికెటర్ 50 వికెట్లు తీయలేదు. అలాంటి 50 ప్రత్యేకమైనది అంటూ ట్విట్టర్‌లో పార్థివ్ పటేల్ పేర్కొన్నారు.

ఏడాదిలో 50కి పైగా వికెట్ల మైలురాయిని రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటివరకు నాలుగుసార్లు (2015, 2016, 2017, 2021) సాధించాడు. ఈ మైలురాయిని ఎక్కువ సార్లు సాధించిన టీమిండియా ప్లేయర్ అశ్వినే కావడం గమనార్హం.
అనిల్ కుంబ్లే మూడుసార్లు (1999, 2004, 2006), హర్భజన్ సింగ్ మూడుసార్లు (2001, 2002, 2008) ఏడాదిలో 50 వికెట్ల మైలురాయిని సాధించారు.

అత్యధికంగా ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ ఎనిమిది సార్లు 50 వికెట్ల మైలురాయిని అధిగమించాడు. ఆ తర్వాత ముత్తయ్య మురళీధరన్ ఆరుసార్లు, గ్లేన్ మెగ్రాత్ ఐదుసార్లు ఈ ఫీట్‌ను సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news