గుంటూరు రాజకీయాల్లో మళ్లీ వారసత్వ రాజకీయాలు తెరమీదికి వచ్చాయి. గత ఏడాది ఎన్నికలకు ముందు కూడా తమ తమ వారసులను రంగంలోకి దింపాలని అనుకున్న ఈ జిల్లాకు చెందిన కీలక నేతలకు చంద్రబాబు షాకిచ్చారు. అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో వారసులకు టికెట్లు ఇచ్చేది లేదన్నారు. దీంతో వారసులను రంగంలోకి దింపాలనుకున్న నాయకులే.. ఎన్నికల్లో పోటీ చేశారు. ఇలాంటి వారిలో రాయపాటి సాంబశివరావు ఒకరు. ఈయన తన కుమారుడు రంగారావును రాజకీయా ల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు.కానీ, ఇప్పటి వరకు చంద్రబాబు అవకాశం ఇవ్వడం లేదు. పార్టీ నేతగా ఉన్నప్పటికీ.. ఓ నియోజకవర్గాన్ని అప్పగించాలన్న.. రాయపాటి కోరిక మాత్రం అలానే ఉండిపోయింది.
ఇక, తాజాగా.. రాయపాటి సాంబశివరావు అనుచరులు సత్తెనపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుతో భేటీ అయ్యారు. రాజకీయాలను చర్చించారని కూడా సమాచారం. దీంతో రంగారావును వైసీపీలోకి పంపించేందుకు సాంబశివరావు వ్యూహాత్మకంగా తన అనుచరులను రాంబాబు దగ్గరకు పంపారనే ప్రచారం జరుగుతోంది. తాము ఎప్పటి నుంచో సత్తెనపల్లి బాధ్యతలను అప్పగిం చాలని చంద్రబాబు కోరుతున్నట్టు.. ఇటీవల ఓ మీడియాతో మాట్లాడిన సందర్భంలోనూ రాయపాటి తన మనసులో మాటలు చెప్పారు.
దీనిపైచంద్రబాబును ఇప్పటికే కోరామని, అయినా.. ఆయన స్పందించలేదన్నారు. ఇక, రాయపాటి కుటుంబ సభ్యులు కూడా ఇటీవల కాలంలో టీడీపీలో చురుగ్గా ఉండడం లేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. కొన్నాళ్ల కిందట రాజధాని ఉద్యమంలో పాల్గొన్న రంగారావు.. తాజాగా 200 రోజు ఉద్యమాల వేడిలో జరిగిన కార్యక్రమంలో డుమ్మా కొట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాయపాటి కుటుంబం చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతోందనే వ్యాఖ్యలకు బలం చేకూరుతోంది. తమను పట్టించుకోకపోతే.. పార్టీ మారేందుకు కూడా సిద్ధమనే సంకేతా లను పంపుతున్నట్టు తెలుస్తోంది.
సుమారు మూడు నాలుగు నియోజకవర్గాలను ప్రబావితం చేయగల రాయపాటి ఫ్యామిలీని చంద్రబాబు వదులుకుంటే.. పార్టీ తీవ్రంగా నష్టపోతుందనే భావన కూడా వ్యక్తమవుతోంది. ఇదే విషయంపై జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు చంద్రబాబుకు ఇప్పటికే సమాచారం ఇచ్చారని కూడా తెలిసింది. మరి బాబు ఏం చేస్తారో చూడాలి.