దేశవ్యాప్తంగా ఉన్న కో-ఆపరేటివ్ బ్యాంకులకు సైబర్ సెక్యూరిటీ కల్పించడంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఆర్‌బీఐ తాజాగా ఓ సైబర్ సెక్యూరిటీ ఫ్రేం వర్క్ తో ముందుకు వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఆర్‌బీఐకి మరిన్ని అధికారాలు ఉండేలా రూపొందించిన ఓ బిల్లును లోక్‌సభలో తాజాగా ఆమోదించారు. దీంతో ఆర్‌బీఐ కో-ఆపరేటివ్ బ్యాంకులకు సైబర్ సెక్యూరిటీ కల్పించేందుకు దృష్టి సారించింది.
ప్రస్తుతం దేశంలో అనేక రకాల బ్యాంకులు ఉన్నాయి. వాటిల్లో కో ఆపరేటివ్ బ్యాంకులు కూడా ఒకటి. అయితే ఈ బ్యాంకులకు ఇతర బ్యాంకుల్లా సైబర్ సెక్యూరిటీ ఉండడం లేదు. దీంతో హ్యాకర్లు తరచూ ఆయా బ్యాంకుల సర్వర్లపై సైబర్ దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే 2018లో పూణెలోని కాస్మోస్ కో-ఆపరేటివ్ బ్యాంకు సర్వర్లపై హ్యాకర్లు సైబర్ దాడి చేసి ఏకంగా రూ.90 కోట్లు కాజేశారు. ఇది దేశంలోనే బ్యాంకులపై జరిగిన అతి పెద్ద సైబర్ దాడి అని నిపుణులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆర్‌బీఐ దేశంలోని కో-ఆపరేటివ్ బ్యాంకులకు సైబర్ సెక్యూరిటీ కల్పించేందుకు నూతనంగా ఓ ఫ్రేం వర్క్‌ను రూపొందించి అందుకు సంబంధించిన పత్రాలను విడుదల చేసింది.
అయితే కో ఆపరేటివ్ బ్యాంకులు తమకు తామే సైబర్ సెక్యూరిటీ కల్పించుకునేందుకు భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఆయా బ్యాంకులు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేవు. అయితే ఆర్‌బీఐ విడుదల చేసిన ఫ్రేం వర్క్ వల్ల ఆయా బ్యాంకులు తమకు తామే సైబర్ సెక్యూరిటీ ఎలా కల్పించుకోవాలో సులభంగా తెలుసుకోవచ్చు. దేశంలోని అనేక మంది నిపుణులను సంప్రదించిన అనంతరం ఆర్‌బీఐ ఆ ఫ్రేం వర్క్‌ను రూపొందించి దానికి సంబంధించిన డాక్యుమెంట్లను విడుల చేసింది. ఈ క్రమంలోనే కో-ఆపరేటివ్ బ్యాంకులకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.