కరోనా నేపథ్యంలో ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈఎంఐ మారటోరియం సదుపాయం కల్పించిన విషయం విదితమే. తొలి విడత మారటోరియాన్ని మార్చి, ఏప్రిల్, మే నెలలకు ఇచ్చారు. తరువాత జూన్, జూలై, ఆగస్టు నెలలకు మారటోరియం సదుపాయం అందజేశారు. దీంతో ఆగస్టు నెలతో రెండో విడత మారటోరియం గడువు కూడా ముగుస్తుంది. అయితే ఇకపై ఈఎంఐ మారటోరియం అందించే అవకాశం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ కేవలం ఇంటి రుణాలను తీసుకున్న వారికి మాత్రమే ఇంకొన్ని నెలల పాటు ఈఎంఐ మారటోరియం సదుపాయాన్ని అందివ్వాలని ఆర్‌బీఐ ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
హోం లోన్లు తీసుకున్న వారికి ఆర్‌బీఐ వన్ టైం లోన్ రీ స్ట్రక్చరింగ్ సదుపాయాన్ని అందిస్తుందని తెలిసింది. దీని వల్ల లోన్ కాలపరిమితిని మరో 2 ఏళ్లు పెంచుతారని సమాచారం. అలాగే నెల నెలా కట్టాల్సిన ఈఎంఐ విలువ కూడా తగ్గుతుంది. దీంతోపాటు ఇంకొన్ని నెలలు అదనంగా మారటోరియం సదుపాయం కల్పిస్తారు. దీని వల్ల హోం లోన్స్ తీసుకున్న వారికి ఎంతగానో ఉపయోగం ఉంటుంది. కరోనా నేపథ్యంలో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు. చాలా మంది హోం లోన్లు తీసుకుని ఉన్నారు కనుక.. వారికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
అయితే ఈ విషయంపై బ్యాంకులు, ఆర్‌బీఐ చర్చించి వచ్చే నెల మొదటి వారంలో నిర్ణయం తీసుకుంటాయని తెలిసింది. అదే జరిగితే హోం లోన్లు తీసుకున్న వారికి ఎంతగానో ఊరట కలుగుతుంది. అయితే మిగిలిన లోన్లను తీసుకున్నవారికి, క్రెడిట్ కార్డులను వాడుతున్నవారికి ఈఎంఐ మారటోరియంతోపాటు లోన్ రీ స్ట్రక్చరింగ్ సదుపాయాన్ని అందిస్తారా, లేదా.. అన్నది చూడాలి.