మన దేశంలో వాహనదారులు తరచూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు కావాలనే రూల్స్‌ను అతిక్రమిస్తారు. కొన్ని సార్లు అనుకోకుండా, ఇంకొన్ని సార్లు విధి లేక అలా చేస్తుంటారు. అయితే ఎలా చేసినా సరే.. తప్పు తప్పే. కనుక ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు వేస్తారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ అయితే జరిమానా పెద్ద ఎత్తున పడుతుంది. జైలు శిక్ష కూడా విధిస్తారు.
అయితే ట్రాఫిక్ నిబంధనలను పదే పదే ఉల్లంఘించేవారిపై మాత్రం ఇకపై అధికారులు కఠినమైన చర్యలు తీసుకోనున్నారు. దీంతోపాటు రాష్ట్రాలకు చెందిన రవాణా శాఖ వెబ్‌సైట్లలో ప్రత్యేక సెక్షన్‌ను ఏర్పాటు చేసి అందులో అలాంటి వారి వివరాలను ఉంచనున్నారు. దీంతో వారి గురించి అందరికీ తెలుస్తుంది. కనీసం ఇలా చేయడం వల్లనైనా అలాంటి వారు మారుతారని కేంద్ర రోడ్డు రవాణా శాఖ భావిస్తోంది.
కాగా కరోనా నేపథ్యంలో ఇప్పటికే దాదాపుగా అన్ని ఆర్టీవో సర్వీసులను ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నారు. మరో వైపు ఆర్‌టీవో కార్యాలయాల్లో రద్దీని తగ్గించేందుకు కూడా ఆన్‌లైన్ సేవలను అందిస్తున్నారు. అయితే పైన తెలిపిన కొత్త విధానాన్ని కేంద్రం ఎప్పటి నుంచి అమలు చేస్తుందో చూడాలి.