మహమ్మారి ప్రభావం తగ్గిన కారణంగా సాధారణ పరిస్థితులు మెల్ల మెల్లగా దగ్గరవుతున్న తరుణంలో విహారయాత్రలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంట్లో ఉండీ ఉండీ బోర్ కొట్టి కనీసం మూడురోజులు, వీలైతే వారం రోజులు పర్యాటకానికి వెళ్ళాలని నిర్ణయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకానికి మళ్ళీ పాతకళ వస్తున్నట్టే కనిపిస్తుంది. భారతదేశంలోని చాలా పర్యాటక ప్రాంతాలు సందర్శకులకు ఆహ్వానం పలుకుతున్నాయి. బ్యాగులు సర్దుకుని బయటకు వెళ్ళడానికి జనాలు కూడా సిద్ధంగా ఉన్నారు.
ఐతే పర్యాటకంలో ఇంట్లో ఉన్నట్టు కాకుండా చాలా స్వేఛ్ఛగా ఉంటారు. ఏది పడితే అది తినడం, డైట్ నియమాలు పాటించకపోవడం జరుగుతుంది. అలా అయితేనే పర్యాటకంలోని ఆనందాన్ని ఆస్వాదించగలరు. కానీ, పర్యాటకంలో మొదలైన ఆ అలవాటు ఇంటికి వచ్చాక కూడా కొనసాగుతుంటుంది. అప్పుడే సమస్య ఎదురవుతుంది. ఒకసారి ఆనకట్ట తెగితే ప్రవాహాన్ని ఎవ్వరూ ఆపలేరు. దాన్ని ఆపడానికి పెద్ద ఎత్తున పని చేయాల్సి ఉంటుంది. వెకేషన్ లో పోగొట్టుకున్న డైలీ రొటీన్ ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి కొంచెం సాధన చేయాల్సి ఉంటుంది.
అవేంటో ఇక్కడ చూద్దాం.
పొద్దున్న లేవగానే ఫోన్ ముట్టుకోకుండా కొంచెం సేపు పక్కన పెట్టండి.
కనీసం అరగంట ధ్యానం చేయండి. దీనివల్ల మీ మెదడుకు మంచి విశ్రాంతి లభించి కొత్తగా ఆలోచించడం మొదలెడుతుంది.
కొత్త టైమ్ టేబుల్ రాసుకోండి. వెకేషన్ కారణంగా పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ ఒకేసారి ముందు పెట్టుకోకుండా మెల్ల మెల్లగా పనుల్లో నిమగ్నం అవ్వండి.
గోరువెచ్చని నీటిలో నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోండి. దానివల్ల కడుపు ప్రశాంతంగా మారుతుంది. అప్పుడు ఆలోచనలు సరిగ్గా సాగుతాయి.
తేలికపాటి ఆహారం తీసుకోండి. త్వరగా జీర్ణమయ్యే ఆహారాలను మాత్రమే తీసుకోవడం ఉత్తమం.