శివరాత్రినాడు శివుడిని పూజిస్తే ఏం వస్తుంది ?

-

శివరాత్రి రోజు శివుడ్ని పూజించని భక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు. అత్యంత ప్రవిత్రమైన పండుగ. కటిక చీకటిలో కన్పించిన జ్యోతిస్వరూపుడు మహాదేవుడు. ఆయన్ను పూజిస్తే కలిగే లాభాలు ఏంటి శాస్త్రాలు చెప్పిన విశేషాలు తెలుసుకుందాం….

విద్యాసుశృతిరుత్కృష్టా , తత్ర రుద్రైకాదశినీస్మృతా |
తత్ర పంచాక్షరీం , తస్య శివఇత్యక్షరద్వయం ||

విద్యలన్నింటిలో వేదముగొప్పదిగా చెపుతారు,అందులోనూ యజుర్వేదంలోని రుద్రము (వీటినే నమక చమకాలనికూడా అంటారు) అందులో అష్టమ అనువాకంలోని పంచాక్షరిని భద్రంగా నిక్షిప్తం చేశారు. అదే ‘‘ ఓం నమశ్శివాయ’’ ఈ పంచాక్షరి అనే మంత్రం గొప్పది అందులోనూ శివ అనే రెండక్షరాలు చాలాగొప్పవని శాస్త్రవచనం. శివ నామమును నారాయణుడు యోగనిద్రలో జపిస్తాడని ప్రతీతి. దేవోత్తముడైన శివుని స్మరణ చేసినవానికి జీవితంలో భోగభాగ్యములను పొందుతారు, మరణానంతరం శివులోకములో సాలోక్యము (శివలోకముగా ఉండుట) పొందుతారు. లేదా సామీప్య (శివునికి దగ్గరగా ఉండుట) జరుగుతుంది, లేదా సారూప్య (శివరూపాన్నీపొందటం )జరుగుతుంది లేదా మోక్షము (అంటే వీటికన్నా అతీత స్థితిపొందుట) జరుగుతుంది అని శివపురాణము ఉదాహరిస్తుంది.

మూడుమూర్తులకును మూడులోకములకు
మూడుకాలములకు మూలమగుచు
భేదమగుచు తుదికభేదమైయొప్పారు బ్రహ్మమనగ నీవె ఫాలనయన !!

అంటారు పోతన భాగవతంలో. అంటే సృష్టి స్థితి లయకారకులగు మూడు దేవతామూర్తులకు,పైలోకాలు,భూలోకము, క్రిందిలోకాలనే మూడు లోకాలకు, వర్తమానకాలాలనే మూడుకాలాలకి మూలముగా ఉండి అన్నిగా విడిపోయి చివరకు తనలోనింపుకునే ఒకే అణు స్వరూప శక్తి శంకరుడు.

ఇక మరో మంత్రం ప్రకారం… శంకరోతి ఇతి శంకరః అనగా శమము లేదా శాంతినిచేయువాడు అని అర్థము. దుఃఖమునందున్నవారికి ఉపశమనం శివనామస్మరణ చేసనవారికి దినదినాభివృద్ధి కలుగుతుంది.
కాసిన్ని నీళ్లు, నాలుగు దళాలు చాలు !

ఏ దేవతారాధనైనా ఖర్చుతో, శ్రమతో కూడుకున్నది. కానీ శివుడు మాత్రం అలా కాదు… భోలాశంకరుడు. ఆయనపైన అంటే లింగంపైన కాసిన్ని నీళ్లు పోసి హరహరా అని నాలుగు బిల్వదళాలు లేదా నాలుగు గన్నేరు, తుమ్మి వంటి పూలను పెడితే చాలు కావల్సినంత అనుగ్రహాన్ని ఇస్తాడు ఆ ముక్కంటి. పురాణ, ఇతిహాసాల ప్రకారం .. అభిషేకప్రియశ్శివః అలంకారప్రియో విష్ణుః, అభిషేక ప్రియశ్శివః అని ఆగమాదులు చెపుతున్నాయి. అలంకారము విష్ణువుకి,అభిషేక శివునికి ప్రీతి. శివునుశిరమున కాసిన్ని నీళ్లుజల్లి పత్తిరి సుమంతనెవ్వాడు పారవైచు కామధేనువు వానింటి గాడిపశువు అల్లసురశాఖ వానింటిమల్లెచెట్టు – చాటువు శివునికి అభిషేకం చేసి పత్రితో పూజించినవాడికి కోరికలు తీర్చే కామధేనువు ఇంటి పశువౌతుంది.ఏదైనా ఇవ్వగలిగే కల్పవృక్షం పెరటి చెట్టౌతుంది (అంతగా వరములిస్తాడని తాత్పర్యం) ఇలా ఇహలోక, పరలోక కోర్కెలను తీర్చేవాడు ఆ మహాదేవుడు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news