గత పదేళ్లలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీల్లో 80% పూర్తి చేయలేదని, అందుకే ఆ పార్టీకి పాలించే హక్కు లేదని TPCC చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘అబద్ధాలే మీ ఆయుధాలు, వంచనలే మీ సిద్ధాంతాలు. నాటకాలే మీకు తెలిసిన విద్యలు. ఈ గడ్డ మరువదు మీరు పెట్టిన గోస.. మీపై లేనే లేదు భరోసా. ముక్కు నేలకు రాసినా.. పొర్లి పొర్లి దండాలు పెట్టినా.. పారవు మీ పాచికలు. తప్పవు మీకు శంకరగిరి మాన్యాలు’ అని రేవంత్ ట్వీట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయాలను కేసీఆర్ ప్రభుత్వం అమాంతం పెంచేసిందని రేవంత్ విమర్శించారు.
ప్రాజెక్టును మొదలుపెట్టినప్పుడు రూ.38,500 కోట్లుగా చెప్పిన ప్రభుత్వం.. టెండర్ల నాటికి రూ.80 వేల కోట్లకు పెంచిందని అన్నారు. ఆ తర్వాత రివైజ్డ్ ఎస్టిమేట్స్లో రూ.1.51 లక్షల కోట్లుగా పేర్కొన్నారని తెలిపారు. ఇప్పటికే ఆ ప్రాజెక్టుపై రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేశారని, కమీషన్లను దండుకునేందుకు కేసీఆర్ ఓ ప్రణాళిక ప్రకారం ఇట్ల అంచనాలను పెం చారని ఆరోపించారు. ప్రాజెక్టు అంచనాలు, పెంచిన వ్యయం, పెట్టిన ఖర్చుపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.