Kantara Review: రిషబ్‌శెట్టి నటించిన ‘కాంతార’ ఎలా ఉందంటే?

-

రిషబ్‌ శెట్టి హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం కాంతార. ‘కేజీయఫ్‌’ సిరీస్‌ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన హోంబలే ఫిల్మ్స్‌ సంస్థ నిర్మించింది. గత నెలలో కన్నడలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొంది. అక్కడి ప్రేక్షకులు.. సినీ విమర్శకులు దీన్నొక క్లాసిక్‌గా అభివర్ణించారు. ప్రభాస్‌, ధనుష్‌ వంటి స్టార్లు సైతం సినిమా చూసి మనసు పారేసుకున్నారు. దాంతో ఈ చిత్రాన్ని మిగతా భాషల్లోనూ డబ్‌ చేయాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. ఈ క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌. అది ఈరోజు థియేటర్లలో విడుదలైంది. మరి ఇంతలా అందరి దృష్టినీ ఆకర్షించిన ‘కాంతార’ చిత్ర కథేంటి? ఇక్కడి ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని పంచింది?

కథేంటంటే: ఓ గొప్ప రాజ్యం.. అంతులేని సంపద.. అందమైన కుటుంబం.. ఇవన్నీ ఉన్నా ఏదో తెలియని లోటుతో మథనపడే ఒక రాజు. మానసిక ప్రశాంతతను వెతుక్కుంటూ దేశమంతా తిరుగుతుండగా ఓ అడవిలో అతనికి ఓ దైవ శిల కనిపిస్తుంది. దాన్ని చూశాక అతనిలో ఓ తెలియని ఆనందం. అంత వరకు తన మనసుని కమ్మేసిన చింత మొత్తం ఆ దైవ రూపాన్ని చూడగానే చటుక్కున మాయమైపోతుంది. అందుకే ఆ దైవ శిలను తనకు ఇచ్చేయమని అక్కడి ఊరి ప్రజల్ని కోరతాడు. దానికి బదులుగా ఆ అడవిని.. దానికి ఆనుకుని ఉన్న భూమిని ఆ ఊరి ప్రజలకు రాసిస్తాడు. ఆ సమయంలో దైవం ఆవహించిన ఓ మనిషి రాజుకు ఓ షరతు విధిస్తాడు. దేవుడికిచ్చిన భూమిని తిరిగి లాక్కునే ప్రయత్నం చేయకూడదని, మాట తప్పితే దైవాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తాడు. అయితే రాజు తదనంతరం ఆయన తనయుడు మాట తప్పుతాడు. తన తండ్రి దానమిచ్చిన భూమిని తిరిగి తీసుకోవాలని ప్రయత్నించగా.. కోర్టు మెట్లపై రక్తం కక్కుకొని చనిపోతాడు. కట్‌ చేస్తే.. కొన్నేళ్ల తర్వాత ఆ భూమి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో భాగమని, దాన్ని ఊరి ప్రజలు ఆక్రమించుకున్నారని ఫారెస్ట్‌ ఆఫీసర్‌ మురళి (కిషోర్‌) సర్వే చేస్తుంటాడు. అయితే అతని ప్రయత్నాలకు శివ (రిషబ్‌ శెట్టి) అడుగడుగునా అడ్డుతగులుతుంటాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి. అదే సమయంలో ఊరికి దొరగా వ్యవహరించే.. రాజ వంశీకులైన దేవేంద్ర (అచ్యుత్‌ కుమార్‌) తమ భూముల్ని తిరిగి దక్కించుకునేందుకు ఓ కుట్ర పన్నుతాడు. మరి ఆ కుట్ర ఏంటి? దాన్ని శివ ఎలా అడ్డుకున్నాడు? మురళీకి అతనికి మధ్య ఉన్న శత్రుత్వం ఎలాంటి సమస్యల్ని సృష్టించింది? ఊరిలో దేవ నర్తకుడైన గురవ హత్యకు.. వీరికి ఉన్న సంబంధం ఏంటి? ఊరి ప్రజల్ని కాపాడటం కోసం భగవంతుడు ఏం చేశాడు? అన్నది మిగతా కథ.

ఎలా ఉందంటే: లైన్‌గా వింటున్నప్పుడు ఈ తరహా కథలు మనకు కొత్తేమీ కాదు కదా అనిపించొచ్చు. నిజమే ఇలాంటి సినిమాలు వెండితెరపై కొన్ని వందలు చూశాం. కానీ, ఇది మాత్రం చాలా ప్రత్యేకం. ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని పంచిస్తుంది. ఓ వినూత్నమైన ప్రపంచంలోకి తీసుకెళ్లి కదలకుండా కూర్చోబెడుతుంది. మట్టిపరిమళాలు అద్దుకున్న కథనం.. దాంట్లోకి దైవత్వాన్ని జొప్పించిన తీరు.. కథలో నుంచి పుట్టిన సహజమైన పాత్రలు.. ఆయా పాత్రల్లో పండే సున్నితమైన హాస్యం.. గుండెతడి చేసే భావోద్వేగాలు.. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే పోరాటాలు.. ప్రతిదీ సినీప్రియుల్ని కట్టిపడేస్తుంది. సినిమాని ఓ చందమామ కథలా ప్రారంభించిన తీరు మెప్పిస్తుంది. అడవిలో రాజుకు దైవ శిల తారసపడటం.. దాన్ని తన ఇంటికి తీసుకెళ్లడం కోసం ఆ ఊరి ప్రజలకు భూమిని రాసివ్వడం.. ఆ సమయంలో దైవం ఆవహించిన వ్యక్తికి, రాజుకు మధ్య జరిగే సంభాషణ.. ఈ ఎపిసోడ్‌ మొత్తం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఆయన తదనంతరం యువరాజు తన ఆస్తి కోసం ఊరి ప్రజలతో గొడవ పడటం.. ఈ క్రమంలో దైవాగ్రహానికి గురై అతను మరణించడం వంటివి కథపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిరేకెత్తించేలా చేస్తాయి.

శివ పాత్ర పరిచయ సన్నివేశాలు.. ఈ క్రమంలో వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ మెప్పిస్తాయి. ఇక అక్కడి నుంచి అతని ఊరు.. స్నేహితులు.. అక్కడి సంస్కృతి సంప్రదాయాల్ని చూపిస్తూ నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దర్శకుడు రిషబ్‌ శెట్టి. ఫారెస్ట్‌ ఆఫీసర్‌ మురళి, శివకు మధ్య గొడవలు ప్రారంభమయ్యాకే కథలో మళ్లీ ఊపొస్తుంది. ఇక మధ్యలో సాగే నాయకానాయికల ప్రేమకథ అంతగా రుచించదు. విరామ సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి. అయితే ఇంటర్వెల్‌ తర్వాత నుంచి కథలో వేగం కాస్త తగ్గుతుంది. ప్రతిదీ విడమర్చి చెప్పాలన్న దర్శకుడి ప్రయత్నం ప్రేక్షకుల సహనానికి కాస్త పరీక్ష పెడుతుంది. తమ పూర్వీకుల ఆస్తిని తిరిగి దక్కించుకునేందుకు దేవేంద్ర కుట్ర పన్నడం.. సర్వే పేరుతో ఫారెస్ట్‌ ఆఫీసర్‌ మురళి చేసే హంగామా.. వీరిని అడ్డుకునేందుకు శివ చేసే ప్రయత్నాలతో ద్వితీయార్ధం సాగుతుంది. అయితే సినిమా మొత్తం ఒకెత్తైతే.. చివరి 20నిమిషాలు మరోకెత్తు. దేవేంద్ర వర్గానికి.. ఊరి ప్రజలకు మధ్య జరిగే యాక్షన్‌ ఎపిసోడ్‌ ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఆఖర్లో తన పాత్రలోకి దైవం ఆవహించాక రిషబ్‌ కనబర్చే నటన రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. ఒకరకంగా ఈ ఎపిసోడ్‌లో రిషబ్‌ తన నట విశ్వరూపాన్ని చూపించారు.

ఎవరెలా చేశారంటే: ఓవైపు నటుడిగా.. మరోవైపు దర్శకుడిగా సినిమాకి ప్రాణం పోశారు రిషబ్‌ శెట్టి. ఆయన నటన.. దర్శకత్వ ప్రతిభ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. పతాక సన్నివేశాల్లో ఆయన నటన శివతాండవంలా ఉంటుంది. సినిమా పూర్తిగా కన్నడ నేటివిటీలో సాగినా.. ఇందులోని భావోద్వేగాలు అన్ని భాషల ప్రేక్షకులకూ కనెక్ట్‌ అవుతాయి. కథలో వచ్చే ట్విస్ట్‌ను ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. అలాగే నాయకానాయికల ప్రేమకథ మరీ రొటీన్‌గా అనిపిస్తుంది. నాయికగా సప్తమి గౌడ చాలా సహజంగా కనిపించింది. ఉద్యోగానికి.. ఊరి ప్రజలకు మధ్య నలిగిపోయే పాత్రలో చక్కటి నటన కనబర్చింది. హీరో స్నేహితుల బృందంలోని చాలా పాత్రలు గుర్తుండిపోయేలా ఉంటాయి. అడవి గ్రామాల్లో పాత్రలు ఎలా ఉంటాయి? ఎలా ప్రవర్తిస్తాయి? అనేది సహజంగా చూపిస్తూ నవ్వించారు. అరవింద్‌ ఛాయాగ్రహణం, అజనీష్‌ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పోరాట ఘట్టాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

రేటింగ్.. 3.25/5

Read more RELATED
Recommended to you

Latest news