పవన్ గ్రాఫ్ పైకే.. వైసీపీకి రిస్కే?

-

రాజకీయాల్లో ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎవరిని హేళన చేయకూడదు. అలా చేయడం వల్ల..చేసినవారే తక్కువ అవుతారు. అధికారంలో ఉన్నాం కదా అని..ఏది పడితే అది మాట్లాడటం..తాము చెప్పిందే ప్రజలు నమ్ముతారనే భావనలో ఉండటం అనేది కరెక్ట్ కానే కాదు. ఏపీలో అధికార వైసీపీ అలాగే ముందుకెళుతుంది. ప్రతిపక్ష నాయకులని హేళన చేసి మాట్లాడటం, వారి ఓటమి సెటైర్లు వేయడం, ఇంకా ప్రజల మద్ధతు తమకే ఉందని ఇష్టారీతిన వ్యవహరించడం, మాట్లాడటం చేస్తున్నారు.

ఇలా చేయడం వల్ల వైసీపీకే రిస్క్ పెరుగుతుంది తప్ప..ఉపయోగం లేదనే చెప్పాలి. పైగా ప్రతిపక్షాలని పైకి లేపినట్లు అవుతుంది. ఇక్కడ చంద్రబాబుని వైసీపీ టార్గెట్ చేసే విషయం పక్కన పెడితే..పవన్‌ని వైసీపీ ఏ విధంగా టార్గెట్ చేస్తూ వచ్చిందో చెప్పాల్సిన పని లేదు. ఆయన ఓటమిపై సెటైర్లు వేస్తూ వచ్చారు. ఆయనకు ప్రజా మద్ధతు లేదనే విధంగా మాట్లాడారు. పవన్‌ని అనేక రకాలుగా కించపర్చడం, ఆయన వ్యక్తిగత జీవితంపై కూడా కామెంట్లు చేయడం చేశారు.

ఇలా చేయడం వల్ల పవన్‌కు పోయిందేమీ లేదు..వైసీపీకే నెగిటివ్ అవ్వడం తప్ప. ఇక తాజాగా విశాఖ గర్జన వేదికగా కూడా చంద్రబాబుతో పాటు పవన్‌ని కూడా వైసీపీ టార్గెట్ చేసింది. మంత్రి రోజా అయితే..ఓ అడుగు ముందుకేసి..పవన్ పెళ్లి చేసుకోవడానికి విశాఖ అమ్మాయి కావాలి అని, పోటీ చేయడానికి గాజువాక కావాలి..కానీ విశాఖ రాజధాని వద్దు అంటున్నారని ఫైర్ అయ్యారు.

రాజకీయ పరంగా విమర్శలు చేస్తే పర్లేదు..కానీ వ్యక్తిగత విమర్శలు చేయడం వైసీపీ నేతలకు పరిపాటి అయింది. పవన్‌ని ఇలా టార్గెట్ చేసిన నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు జనసేన శ్రేణులు భారీగా వచ్చారు. వాస్తవానికి వైసీపీ విశాఖ గర్జనకు జనం ఎలా వచ్చారో తెలిసిందే. కానీ అనూహ్యంగా పవన్ ర్యాలీకి స్వచ్ఛందంగా పార్టీ అభిమానులు, శ్రేణులు తరలివచ్చారు. ఇదే క్రమంలో మంత్రుల కార్లపై దాడులు జరిగాయి. ఏదేమైనా గాని ఈ ర్యాలీతో పవన్ గ్రాఫ్ అమాంతం పెరిగిందనే చెప్పొచ్చు. వైసీపీ నేతలే దగ్గరుండి పవన్ గ్రాఫ్ పెంచుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news