రోహిత్ శర్మ చేతికి గాయం? దక్షిణాఫ్రికా పర్యటనకు కష్టమే

టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లడంపై అనుమానాలు నెలకొన్నాయి. ముంబయిలో ప్రాక్టీస్ సెషన్‌లో అతడి చేతికి బంతి బలంగా తాకడంతో గాయపడినట్లు తెలుస్తున్నది. అతడికి బదులుగా ఇండియా ఏ టీమ్ కెప్టెన్ ప్రియాంక్ పంచాల్‌ను దక్షిణాఫ్రికా పర్యటనకు పంపించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. జట్టు స్పెషలిస్ట్ రాఘవేంద్ర ఆక రఘు నుంచి త్రో డౌన్స్ తీసుకునే క్రమంలో రోహిత్ శర్మ గాయపడ్డాడు. ప్రస్తుతానికి అతడి గాయం తీవ్రతపై స్పష్టత లేదు.

రోహిత్ శర్మ్‌ చేయిని కదపడంలో కొంత ఇబ్బంది పడుతున్నాడని, ఆ సమస్యను పరిష్కరించేందుకు వైద్య బృందం ప్రయత్నిస్తుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లడానికి సంసిద్ధంగా ఉండాలని ప్రియాంక్ పంచల్‌కు బీసీసీఐ అధికారులు సమాచారం ఇచ్చారు. దక్షిణాఫ్రికా ఏ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో పంచల్ 96 పరుగులు చేశాడు.