ట్రిపుల్ ఆర్ సినిమాకు షాక్… స్టే విధించాలని హైకోర్ట్ లో పిల్

-

ట్రిపుల్ ఆర్ సినిమాకు మరో షాక్ తగిలింది. అల్లూరి సీతారామరాజు, కొమురంభీం చరిత్రను వక్రీకరించారని తెలంగాణ హైకోర్ట్ లో పిల్ దాఖలైంది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ట్రిపుల్ ఆర్ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వద్దని, సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని పిటిషన్ దారు హైకోర్ట్ ను కోరారు. జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వర రెడ్డి ధర్మాసనం ముందుకు ఈ వ్యాజ్యం రాగా.. ప్రజాప్రయోజన వ్యాజ్యం కావడంతో సీజే ధర్మాసనానికి బదిలీ చేసింది.

విడలకు ముందు నుంచే ట్రిపుల్ ఆర్ సినిమా వివాదాల్లో నలుగుతోంది. కొమురం భీం క్యారెక్టర్ పై గతంలో ఆదివాసీల నుంచి తీవ్ర ప్రతిఘటన వచ్చింది. మరోవైపు కరోనా కారణంగా ఇప్పటికే పలు సార్లు వాయిదా పడింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా, ఎన్టీఆర్ కొమురం భీంగా నటిస్తుండగా.. రూ.450 కోట్ల భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించారు. ఈ సంక్రాంతికి జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా… కరోనా కారణంగా వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అధికారికంగా తెలిపింది. ఇటీవల అన్ని రాష్ట్రాల్లో ప్రమోషన్లతో హోరెత్తించింది చిత్రయూనిట్. అయితే గతంలో కూడా ఇలాగే వాయిదా వేసింది. 2020 జూలై 30న విడుదల చేస్తామని చెప్పినా.. షూటింగ్ ఆలస్యం కావడంతో అక్టోబర్ 13న థియేటర్లలోకి వస్తామని చెప్పారు. అయితే చివరిగా 2022 జనవరి 7న విడుదల చేస్తామని చెప్పినా… కరోనా కారణంగా మళ్లీ వాయిదా పడింది.

Read more RELATED
Recommended to you

Latest news