తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇప్పుడు పడకేసింది.. పల్లె వెలుగు కదలనంటుంది.. చక్రాలు ముందుకు సాగడం లేదు.. ప్రగతి చక్రాలను నడిపే సారథులు తమ కోర్కెలు తీర్చమంటున్నారు.. కానీ సర్కారు ఒక్కడుగు ముందుకేస్తే నాలుగడుగులు వేనకకేస్తుంది.. కార్మికుల హక్కుల కోసం పోరాటంలో.. సర్కారు ప్రతిష్ట కోసం పాకులాడుతున్న తరుణంలో సాధారణ ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సర్వీసులు స్తభించిపోయాయి.. డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి.. అసలు హైదరాబాద్‌లో అయితే పేరుకైనా ఒక్క బస్సు కనబడని పరిస్థితి. పల్లేకు పోదామనుకున్న ప్రయాణికులకు కూడా పల్లెవెలుగు బస్సులు మచ్చుకైనా కనిపించడం లేదు..
రాష్ట్రవ్యాప్తంగా బస్సుల బంద్‌తో ట్యాక్సీలు, ఆటోలను ప్రయాణికుల ఆశ్రయిస్తుండగా, వారి వద్ద ముక్కుపిండి ఆధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెతో రాష్ట్రంలోని అన్ని జిల్లాలల్లో దసరా పండుగ కళ తప్పనున్న సంకేతాలు వెలువడుతుండగా, తమ ఊళ్ళకు వెళ్శే ప్రయాణికులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఓవైపు కార్మికులు ఉదయం 5గంటల నుంచే బస్సుల డిపోల ముందుకు వచ్చి ఆందోళనలు చేయడం చేస్తున్నారు. దీంతో డీపోల నుంచి ఒక్క బస్సుకూడా కదలని స్థితి. కార్మికులు దసరాను అదనుగా చేసుకుని ముందుకు పోతుండగా, ప్రభుత్వం కూడా మొండిగానే వ్యవహరిస్తుంది.
ఆర్టీసీ సమ్మె విషయంలో కఠినంగానే వ్యవహరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇవాళ సాయంత్రం 6 గంటల లోపు ఆయా ఆర్టీసీ డిపోల్లో రిపోర్టు చేసిన వారిని మాత్రమే ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా గుర్తించాలని, ఆ సమయంలోగా విధుల్లో చేరని వారిని తమంతట తాముగా ఉద్యోగాలు వదిలిపెట్టిన వారిగా గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై కార్మిక సంఘాల నాయకులతో ఎలాంటి చర్చలు జరపవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కార్మికులతో చర్చల కోసం నియమించిన సీనియర్ ఐఎఎస్ అధికారుల కమిటీ కూడా రద్దయిపోయింది.
ఇక కార్మికులు ఎవరికి వారే డ్యూటీలో జాయిన్ కావాలని లేకుంటే తొలగింపు తప్పదని సీఎం కేసీఆర్ హెచ్చరిస్తున్నారు. ఇటు కార్మికులు కూడా ఈ దసరా వంద దసరాలతో సమానం.. ఈ దసరా ఆర్టీసీ కార్మికుల ధర్నాతో చరిత్రలో నిలిచిపోవాలని వారు మంకు పట్టుపట్టారు. ఇరు పక్షాల పంతాలు, పట్టింపులతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.. కేసీఆర్ ఇచ్చిన వార్నింగ్‌తో ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమిస్తారో లేక కొనసాగిస్తారో వేచి చూడాల్సిందే…