ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులకు, విదేశాంగ శాఖ, భారత ఎంబసీలు కీలక ఆదేశాాలు జారీ చేశాయి. ఖర్కీవ్ నగరంలోని భారతీయులు వెంటనే బయలుదేరాలని సూచించింది. వెంటనే ఖర్కీవ్ నగరాన్ని వదిలి ఈరోజు సాయంత్రం( ఉక్రెయిన్ కాలమాన ప్రకారం) 6 గంటల కల్లా.. వీలైనంత త్వరగా పిసోచిన్, బెజ్లియుడోవ్కా & బాబేకి వెళ్లండి అంటూ ఆదేశాలు జారీ చేసింది. నాలుగు గంటల్లోనే ఖార్కీవ్ ను ఖాళీ చేయాలని భారతీయులకు.. భారత ప్రభుత్వం సూచించింది.
ఇదిలా ఉంటే ఈరోజు ఉక్రెయిన్ రాజధాని కీవ్ తో పాటు రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్ పై రష్యా దళాలు విరుచుకుపడుతున్నాయి. జనవాసాలే లక్ష్యంగా రష్యా సేనలు విరుచుకుపడుతున్నాయి. ఖార్కీవ్ లో వచ్చే 100 గంటల్లో భీకర దాడులు జరిగే అవకాశం ఉండటంతో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. భారతీయులను రక్షించే చివరి మార్గాలను సూచించింది. ఉక్రెయిన్ పై ఇక భారీ ఎత్తున రష్యా దాడులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కీవ్ నగరంలోని భారతీయులు అంతా పశ్చిమ ప్రాంతానికి తరలిపోయారు. కీవ్ లో భారతీయులు ఎవరూ లేరని ఇండియన్ ఎంబసీ ప్రకటించింది.