చంద్రబాబు మెడికల్ బెయిల్ మీద మరింతకాలం ఉండడానికి వీలుగా మెడికల్ రిపోర్టు ఇచ్చినట్టుందని వైసీపీ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చర్మ వ్యాధులను ప్రాణాంతక వ్యాధులన్నట్టు మెసేజ్ వచ్చేలా చేశాడన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. 14 గంటలకు పైగా కారులో ప్రయాణించి విజయవాడ రావడం చూస్తే సహజంగా కామెంట్ చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఏఐజీ ఆసుపత్రి రిపోర్టు చూస్తే వైద్యులా, పొలిటికల్ డాక్టర్లా అన్నట్టు కనిపిస్తుందని సజ్జల దుయ్యబట్టారు. పబ్లిక్ లైఫ్‌లో ఉంటారు కనుక ఒక అంబులెన్స్ ఉండాలి అని ఇవ్వడం చూస్తే అర్థం అవుతుందన్నారు. స్టంటు వేయాల్సినంతగా 1600 వస్తే.. చాలా క్యాజువల్‌గా రిపోర్టు ఇచ్చారన్నారు. కేన్సర్ ఉన్నట్టయితే ఇప్పటికే బయటపడలేదా అంటూ ప్రశ్నించారు.
చంద్రబాబు పొలిటికల్ అవసరానికి సూడో మెడికల్ వ్యవహారం చేస్తున్నట్లు అందరూ గమనించాలని సజ్జల కోరారు. మేనిఫెస్టో కోసం రెండు దేశాల అగ్రనాయకుల లాగా పవన్ కళ్యాణ్ , చంద్రబాబు కూర్చున్నారని సజ్జల ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోతో ప్రజల చెవుల్లో క్యాలిఫ్లవర్ పెడుతున్నారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ ల బరితెగింపును ప్రజలు గమనించాలని అన్నారు. సీఎం జగన్ ప్రజల నుంచి తెచ్చుకున్న అజెండా అమలు ఫలితాలే అందరూ గమనిస్తున్నారని తెలిపారు. ఈ విషయం సామాజిక సాధికారత యాత్ర స్పందన తోనే తెలుస్తుందని పేర్కొన్నారు.