రాష్ట్రానికి వరదలా ఒకేసారి భారీ పెట్టుబడులు రావటం సంతోషకరం అన్నారు వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. 24 వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిందని తెలిపారు. వీటిని చూసి చంద్రబాబు, ఆయన మీడియాకు కడుపు మంటగా ఉందని విమర్శించారు.
రివర్స్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను పరిశ్రమల కింద పరిగణించారని.. ఈ విషయంలో రహస్యం ఏమీ లేదని స్పష్టం చేశారు. అదానీలు, షిర్డీలు మాకు ఏదో బంధువులు అయినట్లు, అవినీతి జరిగినట్లు చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం బాగు పడాలి అని ఆలోచించే వ్యక్తి జగన్ అని అన్నారు. చంద్రబాబుది బరితెగింపు వ్యవహార శైలి అన్నారు సజ్జల. చంద్రబాబు హయాంలో కడప స్టీల్ ప్లాంట్ ను ఎందుకు కట్టలేక పోయారు? అని ప్రశ్నించారు.
ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ఒక పరిశ్రమను తీసుకుని వస్తే వెటకారం చేస్తున్నారని మండిపడ్డారు. అంటే జగన్ హయాంలో పరిశ్రమలు రాకూడదు అన్నది వీళ్ళ కోరిక అని దుయ్యబట్టారు సజ్జల. జగన్ అర్జెంటుగా దిగిపోవాలి, చంద్రబాబు అధికారంలోకి వచ్చేయాలి….ఈ రెండు జరిగితే వీళ్ళకు అంతా ప్రశాంతంగా కనిపిస్తుందని విమర్శించారు.