ఏపీలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వివాదం రోజురోజుకు రాజుకుంటోంది. తాజాగా ఈ వివాదంపై సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని ప్రభుత్వ అన్నారు. అడ్డదారుల్లో పోవడం సీఎం జగన్‌కు తెలియదని చెప్పారు. ఫోన్ మాట్లాడేటప్పుడు ఎవరో ఆడియో రికార్డింగ్ చేస్తే దాన్ని ట్యాపింగ్ అంటున్నారని తెలిపారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి పరుషంగా మాట్లాడిన మాటలు ఎవరో రికార్డింగ్ చేసి ఉండొచ్చని, ఆ ఆరోపణలు బయటకు వస్తే దాని గురించి ఇంటెలిజెన్స్ చీఫ్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఉండొచ్చేమో తెలియదని సజ్జల అన్నారు. 2024లో టీడీపీ నుంచి కోటంరెడ్డి పోటీ చేసేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకున్నట్టు కనిపిస్తోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు కొత్త అభ్యర్థిని పార్టీ చూసుకుంటుందని స్పష్టం చేశారు.
మరోవైపు తమ ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేయిస్తోందని సొంత పార్టీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్రమత్తమయ్యారు. నెల్లూరు జిల్లా వ్యవహారాలు చూస్తోన్న పార్టీ రీజినల్ కో-ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో పాటు పార్టీ ముఖ్యనేతలతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలనే విషయమై నేతలతో సీఎం సమాలోచనలు చేశారు