అవును.. రాజధాని అమరావతి అంశం.. రాజకీయాల నుంచి మీడియా బాట పట్టింది. రాజధానిని మార్చకూడదని, మూడు రాజధానులు వేస్ట్ అని.. దీనిలో రాజకీయ కుట్ర ఉందని.. ఇన్‌సైడ్ ట్రేడింగ్ అస్సలు జరగనే లేదని ఇటీవల వరకు టీడీపీ నేతలు ఆరోపించారు. అధికార పార్టీపై దుమ్మెత్తి పోశారు. అయితే, అదేసమయంలో అధికార పార్టీ కూడా మూడు రాజధానులే కావాలని, మూడుతోనే అభివృద్ధి అని.. రాజధానిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ జరిగిందని.. చంద్రబాబు కుట్ర ఉందని వైసీపీ నేతలు రోడ్డెక్కారు. సరే.. రాజకీయాలు ఇలానే ఉంటాయని అందరూ అనుకున్నారు. వాస్తవాలు తెలుస్తాయని భావించారు.
ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఈ రాజధాని విషయం.. మీడియా వేదిక ఎక్కింది. నిన్న మొన్నటి వరకు నేతలు అలా చెప్పారు.. ఇలా చెప్పారు.. అని రాసుకొచ్చిన.. ఓ వర్గం బాబు అనుకూల మీడియా.. ఇప్పుడు నేరుగా రంగంలోకి దిగిపోయింది. తనంతట తానుగానే అమరావతిపై అనుకూల కథనాలు రాసుకొచ్చింది. రాజధాని తుళ్లూరులోనే వస్తుందని.. తాము ముందుగానే చెప్పామని, బాబుకు కూడా అప్పట్లో ఈ విషయం తెలియదని, పైగా ఏపీ విడిపోతే.. విజయవాడంత అందమైన నగరం.. అద్భుత నగరం మరొకటి లేదు కాబట్టి.. అదే రాజధాని అవుతుందని తామే ముందు చెప్పామని.. కాబట్టి బాబును ఏమీ అనాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ఇక, ఇదే విషయాన్ని జగన్ సొంత మీడియా సాక్షి ఎప్పుడో చెప్పిందని.. కూడా బాబు అనుకూల మీడియా రాసుకొచ్చింది. తుళ్లూరులో రాజధాని వస్తుందని. సాక్షి కూడా రాసిందని.. అదే సమయంలో ఇక్కడైతేనే నది కూడా దగ్గరగా ఉంది.. నీటికి ఇబ్బందులు ఉండవని పేర్కొందని.. రాసుకొచ్చింది. ఈ కథనాలపై సాక్షి కూడా ఇదే రేంజ్‌లో రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక, ఈ పరిణామాలను గమనిస్తే.. అమరావతి రగడ.. రాజకీయ పరిధి దాటిపోయి.. మీడియా సంస్థల మధ్య పోరుగా మారిపోయిందనే దృశ్యం కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి ఇది ఎటు దారితీస్తుందో చూడాలి. ఏదేమైనా.. మీడియా దారి తప్పుతోందని అంటున్నారు మేధావులు.
-vuyyuru subhash