కోవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇప్పటికే పలు యాంటీ వైరల్ మెడిసిన్లతోపాటు ఇతర మెడిసిన్లను కోవిడ్ చికిత్స కోసం వాడుతున్నారు. అయితే వ్యాక్సిన్ వచ్చేందుకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే కరోనాను ఎలా కట్టడి చేయాలనే విషయంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మంది సైంటిస్టులు అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నారు. వాటిల్లో ఉప్పునీటి ప్రయోగం కూడా ఒకటి.
ఉప్పు నీటితో ముక్కు లోపల శుభ్రం చేసుకోవడం, గొంతులో ఆ నీరు వేసుకుని పుక్కిలించడం చేస్తే జలుబు తగ్గుతుందని సైంటిస్టులు గతంలోనే తేల్చారు. అయితే మనకు కనిపించే కరోనా ప్రధాన లక్షణాల్లో జలుబు కూడా ఒకటి కనుక.. దాన్ని ఆపగలిగితే శరీరంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉంటుందని సైంటిస్టులు భావిస్తున్నారు. అందుకనే కరోనాకు ఉప్పు నీరు చెక్ పెడుతుందా, లేదా అనే విషయంపై ప్రస్తుతం వారు ప్రయోగాలు చేస్తున్నారు. స్కాట్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ పరిశోధకులు 18 ఏళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న పలువురు కోవిడ్ 19 పేషెంట్లపై ఉప్పు నీటితో ప్రయోగాలు చేస్తున్నారు. వారికి నిత్యం 12 సార్లు (2 గంటలకు ఒకసారి చొప్పున) ఉప్పు నీటితో ముక్కును శుభ్ర పరుచుకోవాలని, అలాగే గొంతులో ఆ నీటిని పోసి పుక్కిలించాలని చెప్పారు. దీంతో ఆ పేషెంట్లు అలాగే చేస్తున్నారు. ఈ క్రమంలో కరోనా తీవ్రత ఎలా ఉంది, కరోనా వల్ల వచ్చే జలుబు తగ్గిందా, ఇతర లక్షణాలు ఏవైనా తగ్గాయా, వైరస్ వ్యాప్తి తగ్గిందా.. అనే అంశాలను సైంటిస్టులు పరిశీలిస్తున్నారు.
అయితే ఉప్పు నీరు జలుబును తగ్గిస్తుందని గతంలోనే రుజువైనందున ఆ నీరు ఇప్పుడు కరోనా వైరస్‌ను కూడా తగ్గిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలను ఆ సైంటిస్టులు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.