ఆ ఎమ్మెల్యే మౌనం పై సొంతపార్టీలోనే గుసగుసలు

-

ఆయనో సీనియర్ ఎమ్మెల్యే. తన నియోజకవర్గంలో సమస్యలు వస్తే అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తుంటారు. అలాంటి ఎమ్మెల్యేను ఒకటిరెండు సమస్యలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయట. ఎందుకొచ్చిన గొడవ అని జనాలకు ఆమడ దూరంలో ఎమ్మెల్యే ఉంటే… ఆయన మౌనంపై జనంతో పాటు సొంతపార్టీనేతలు సైతం గరంగరంగా ఉన్నారట.

అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజా సమస్యలపై గళమెత్తుతారు విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర. గిరిజనులకు కష్టం వస్తే అధికారులను అస్సలు ఉపేక్షించరు. అలాంటి ఎమ్మెల్యే కొంతకాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్‌ విజయాలు సాధించిన రాజన్నదొరకు ఎందుకీ పరిస్థితి అన్న చర్చ జోరందుకుంది.

సాలూరు నియోజకవర్గం అంతా ఏజెన్సీ ప్రాంతమే. ఇక్కడి గిరిజనులంతా కొండకోనల్లో నివసిస్తారు. పైగా రాజన్నదొర అంటే గురి ఎక్కువ. అలాంటి కొండకోనలపై భూ స్వాములు.. బడా కాంట్రాక్టర్ల కన్ను పడటంతో నియోజకవర్గం వివాదాల పుట్టగా మారిపోయిందట. ఈ సందర్భంగా తలెత్తిన సమస్యలపై స్థానికులు ఆందోళనలు చేపడుతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నియోజకవర్గ పరిధిలోని పాచిపెంట మండలంలో 700ఎకరాలకుపైగా భూములపై వివాదం కొనసాగుతోంది. దశాబ్దాలుగా అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నామన్నది గిరిజనుల వాదన. కొందరు ఇవి తమ ఇనామ్‌ భూములని చెప్పడంతో గొడవ మొదలైంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య సర్వే చేపట్టాలని అధికారులు నిర్ణయించగా.. గిరిజనులు ఆ సర్వేకు వ్యతిరేకంగా పోరుబాట పట్టారు. ఈ విషయంలో స్పందించాలని కోరినా ఎమ్మెల్యే స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు గిరిజనులు.

సాలూరు మండలం శిఖపరువులో మాంగనీస్‌ మైనింగ్‌పై కొందరి కన్ను పడిందట. దీని చుట్టుపక్కడ ఉన్న 12 గిరిజన గ్రామాల వారు మైనింగ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ ఆందోళనను కూడా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు గిరిజనులు. అలాగే షెడ్యూల్‌ ట్రైబ్‌ సర్టిఫికెట్ల జారీపైనా కోర్టుకెళ్లమని చెబుతున్నారు తప్ప.. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. గెజిట్‌ ప్రకారం 1496 గిరిజన గ్రామాలు ఉంటే.. 680 గ్రామాలనే లెక్కల్లో చూపిస్తున్నారని విద్యార్ధుల ఆరోపణ. దీనివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో గిరిజనులకు ఏ సమస్య వచ్చినా అడక్కుండానే సాయపడిన ఎమ్మెల్యే రాజన్నదొరకు ఏమైందనే ప్రశ్నలు సొంతపార్టీలోనే వినిపిస్తున్నాయట. స్వయంగా నియోజవర్గంలోని గిరిజనులు రోడ్డెక్కినా మౌనం వహించడం వెనక కారణం ఏమై ఉంటుందా అని ఆరా తీస్తున్నారట. దీంతో దొర మౌనంపై అక్కడి జనం గరంగరం అవుతున్నారు. మరి.. ఎమ్మెల్యే తన మౌనానికి కారణం చెబుతారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news