పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈనెల 5వ తేదీన కమలాపూర్ లోని పంగిడిపల్లి లో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర పర్యటనలో కొంతమంది రాళ్ల దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అయితే దాడి చేసిన వారిని వదిలేసి బిజెపి నేతలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని బిజెపి ఆరోపిస్తోంది. అలా జైలుకు వెళ్లి వచ్చిన కార్యకర్తలను నేడు బండి సంజయ్ సన్మానించారు.
నేడు కమలాపూర్ లో పర్యటించిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులకు కొట్టే అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. పోలీసులు కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతున్నారని ఆరోపించారు బండి సంజయ్. తీరు మారకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. గుండాలకు గన్ లైసెన్సులు ఇస్తారా? అని నిలదీశారు. ఈటెల కాన్వాయ్ పై రాళ్లతో దాడి చేసింది బిఆర్ఎస్ కార్యకర్తలే అయితే తమ కార్యకర్తలపై ఎందుకు కేసులు పెట్టారని మండిపడ్డారు. మరో మూడు నెలలు మాత్రమే బీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని.. ఇలా చట్టాలను అతిక్రమించి బిఆర్ఎస్ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.