మనీలాండరింగ్ కేసులో ఆరోపణలపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆప్ నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మరో 14 రోజులపాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. సోమవారంతో ఈడీ కస్టడీ ముగియడంతో సత్యేందర్ జైన్‌ను కోర్టులో హాజరుపరిచారు. అతని బెయిల్ కోసం జైన్ తరఫు న్యాయవాది దరఖాస్తు చేశారు. అయితే బెయిల్ పిటిషన్‌పై ప్రత్యుత్తరం దాఖలు చేయడానికి ఈడీ తరఫు న్యాయవాది వెల్లడించారు. సత్యేందర్ జైన్ బెయిల్ పిటిషన్‌పై మంజూరుకు మరింత సమయం కావాలని ఈడీ కోరింది. దీంతో తర్వాతి బెయిల్ విచారణకు మంగళవారానికి వాయిదా వేసింది.
ఈ సందర్భంగా ఈడీ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. సత్యేందర్ జైన్ కావాలనే మందులు వాడటం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే అనారోగ్య కారణాలు చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో జైన్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. జైన్ ఆరోగ్య పరిస్థితి నిజంగానే విషమంగా ఉందని, ఇలాంటి ఆరోపణలు సబబు కాదన్నారు. దీంతో జైన్‌ను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.