కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గన్నవరం విమానశ్రయంలో ఆయనకు పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత స్వాగతం పలికారు. అనంతరం అమిత్ షా హెలికాప్టర్‌లో ఖమ్మం సభకు బయలుదేరారు. అమిత్ షా కొద్దిసేపు ఏపీ బీజేపీ నేతలతో మాట్లాడారు. అమిత్ షాకి స్వాగతం పలికిన వారిలో ఏపీ బీజేపీ మీడియా ఇన్చార్జి పాతూరి నాగభూషణం, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రసాద్ తదితరులు ఉన్నారు.
రైతు గోస.. బీజేపీ భరోసా బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సభలోనే అమిత్ షా రైతు డిక్లరేషన్‌ను ప్రకటించారు. రైతు గోస-బీజేపీ భరోసా సభ వేదిక వద్ద ఆయనకు తెలంగాణ బీజేపీ అగ్రనేతలు స్వాగతం పలికారు. కాగా, అమిత్ షా సభలో తిరుమలను కాపాడాలంటూ ప్లకార్డులు దర్శనమిచ్చాయి. కొందరు వ్యక్తులు సేవ్ తిరుమల, సేవ్ టీటీడీ అనే ప్లకార్డులను ప్రదర్శించారు.