తెలుగు రాష్ట్రాల్లో దసరా కళ వచ్చేసింది. రేపటి నుంచి (శుక్రవారం) తెలంగాణలో ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించారు. తిరిగి ఈ నెల 26న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. దాదాపు అన్ని పాఠశాలల్లో నిన్నటి వరకు పరీక్షలు ముగిశాయి. ఈ రోజు స్కూల్స్, కాలేజీలలో పెద్ద ఎత్తున బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. విద్యార్థినులు బతుకమ్మలతో స్కూళ్లు, కాలేజీలకు తరలి వచ్చారు. బొడ్డెమ్మ, బతుకమ్మ ఆడుకున్నారు. రేపటి నుంచి దసరా సెలవుల నేపథ్యంలో ప్రభుత్వ హాస్టల్స్‌లో ఉంటున్న విద్యార్థులు తమ ఊళ్లకు బయలుదేరారు. దీంతో బస్సులు కిక్కిరిసిపోయాయి. మరోవైపు జూనియర్ కాలేజీలకు ఈ నెల 19వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ప్రభుత్వం సెలవులు ఇచ్చింది.
అయితే.. దసరా సెలవు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవును 23, 24కి మార్చేసింది. అంతకు ముందు 24, 25 తేదీలలో దసరా సెలవు ప్రకటించగా.. రెండు రోజుల క్రితం సెలవులపై క్లారిటీ ఇచ్చింది. దసరా పండుగ 23, 24 తేదీల్లోనే అని క్లారిటీ ఇచ్చింది. ఈ ఏడాది అధిక మాసం కారణంగా దసరా పండుగ విషయంలో కన్‌ఫ్యూజన్ నెలకొంది. ఈ నేపథ్యంలోనే క్లారిటీ సెలవులో మార్పులు చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో పాటు ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను ప్రభుత్వ పండుగగా గుర్తించిన నేపథ్యంలో.. అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలు.. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది.