అంతరిక్షంలో ఖగోళ శాస్త్రవేత్తలు, వ్యోమగాములు అప్పుడప్పుడు పలు అనుమానాస్పద రేడియో సిగ్నల్స్‌ను గుర్తిస్తుంటారు. నిజానికి వాటిని ఎవరు రిలీజ్ చేస్తారో తెలియదు కానీ, సైంటిస్టులు శాటిలైట్ల సహాయంతో ఆ సిగ్నల్స్‌ను గుర్తిస్తుంటారు. ఇక తాజాగా మన పాలపుంత నుంచే ఓ రేడియో సిగ్నల్ వచ్చినట్లు సైంటిస్టులు గుర్తించారు. కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందనేది అనుమానాస్పదంగా మారింది.
కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ టొరొంటోకు చెందిన ది అస్ట్రానమర్స్ టెలిగ్రాం బై పాల్ స్కోల్జ్ లో వ్యోమగాములు తాము తాజాగా గుర్తించిన రేడియో సిగ్నల్ తాలూకు వివరాలను వెల్లడించారు. అయితే ఆ రేడియో సిగ్నల్‌ను Fast Radio Burst (FRB) అని పిలుస్తారు. సాధారణంగా సిగ్నల్స్ మిల్లీ సెకన్ల వ్యవధిలోనే వచ్చి మాయమవుతుంటాయి. అంతటి తక్కువ సమయంలో ఆ సిగ్నల్స్ వచ్చినా.. శాటిలైట్లు వాటిని గుర్తించి రికార్డు చేయగలవు. అనంతరం సైంటిస్టులు ఆ సిగ్నల్స్‌ను ట్రేస్ చేసి అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపి ఉంటారు.. అనే విషయాలను విశ్లేషిస్తారు.
నిజానికి ఈ FRB లు గత దశాబ్ద కాలంగా సైంటిస్టులకు తారసపడుతున్నాయి. కానీ అవి ఎక్కడి నుంచి ఉద్భవిస్తున్నాయో ఇప్పటి వరకు వారు అంచనా వేయలేకపోయారు. కొందరేమో గ్రహాంతర జీవుల పనే అంటుంటే.. మరికొందరు మాత్రం కృష్ణ బిలాలు నాశనం అయినప్పుడు వస్తాయని అంటున్నారు. అయితే ప్రస్తుతం సైంటిస్టులు గుర్తించిన FRB మాత్రం ఏకంగా మన సొంత పాలపుంత వ్యవస్థ నుంచే రావడం విశేషం. దీంతో ఈ సిగ్నల్‌పై సైంటిస్టులకు ఆసక్తి పెరిగింది. ఇక దానికి సంబంధించి శాటిలైట్లు రికార్డు చేసిన సమాచారాన్ని మరింత లోతుగా విశ్లేషిస్తే గానీ.. ఆ FRBల గురించి తెలియదు. అందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని సైంటిస్టులు అంటున్నారు..!