ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో రాజకీయం ఆసక్తికరంగా నడుస్తోంది. ఈ ప్రాంతంలో అటు అధికార వైసీపీలో ఇటు ప్రతిపక్షలో టిడిపిలో సైతం సీట్ల విషయంలో పోరు నడుస్తోంది. అమరావతి ప్రాంత పరిధిలో పూర్తిగా ఉన్న తాడికొండ స్థానంలో రెండు పార్టీల్లో ఆధిపత్య పోరు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో జగన్ గాలిలో తాడికొండలో వైసీపీ నుంచి ఉండవల్లి శ్రీదేవి గెలిచిన విషయం తెలిసిందే.
గెలిచిన తక్కువ రోజుల్లోనే ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న ఎమ్మెల్యేగా శ్రీదేవి నిలబడ్డారు. అందుబాటులో లేకపోవడం, ప్రజా సమస్యలు పట్టించుకోకపోవడం, ముఖ్యంగా రాజధానిని మార్చడం లాంటివి తాడికొండలో వైసీపీకి బాగా నెగిటివ్ అయ్యాయి. మళ్ళీ అక్కడ వైసీపీ గెలవడం చాలా కష్టమనే పరిస్తితి. ఇదే సమయంలో జగన్ వ్యూహాత్మకంగా నెక్స్ట్ సీటు శ్రీదేవికి లేదని చెబుతూ..డొక్కా మాణిక్య వరప్రసాద్‌ని ఇంచార్జ్ గా పెట్టారు. దీంతో శ్రీదేవి వర్గం గోల చేసింది. అయితే తర్వాత కత్తెర సురేశ్‌ని ఇంచార్జ్‌గా పెట్టారు.
దీంతో తాడికొండ సీటు కత్తెరదే అని ప్రచారం మొదలైంది. అటు డొక్కా సైతం తాడికొండ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఇటు శ్రీదేవి మళ్ళీ సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. కానీ ఈ సారి సీటు మాత్రమే శ్రీదేవికి దక్కడం డౌటే. వైసీపీలో ఎవరికి దక్కుతుందో చూడాలి.
అటు టిడిపిలో సైతం సీటు విషయంలో ట్విస్ట్ ఉంది. ఇక్కడ ఇంచార్జ్ గా తెనాలి శ్రవణ్ కుమార్ ఉన్నారు…ఈ సారి ఆయనకు సీటు ఇవ్వరనే ప్రచారం ఉంది. ఇదే సమయంలో తాడికొండ సీటు తోకల రాజవర్ధన్ రావుకు ఇవ్వాలని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డిమాండ్ చేస్తున్నారు. ఇటు అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు సైతం తాడికొండ సీటు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. టిడిపిలో తాడికొండ సీటు ఎవరికి దక్కుతుందో క్లారిటీ లేదు. మొత్తానికి తాడికొండ సీటు కోసం రెండు పార్టీల్లో రచ్చ నడుస్తోంది.