ఏపీ ప్రభుత్వం vs ఏపీ ఎన్నికల సంఘం మధ్య లేఖల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ కు ఎస్ఈసీ నిమ్మగడ్డ మరో లేఖ రాశారు. సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎస్ఈసీ సూచించారు. ఎస్ఈసీ ఆదేశాలు అమలు కాకుండా ప్రవీణ్ ప్రకాష్ అడ్డుకుంటన్నారని ఎస్ఈసీ ఆరోపించారు.
ఈ నెల 23వ తేదీన నిర్వహించాలనుకున్న వీడియో కాన్ఫరెన్స్ కు అధికారులను హాజరు కాకుండా ప్రవీణ్ ప్రకాషే అడ్డుకున్నారని లేఖలో స్పష్టం చేసిన నిమ్మగడ్డ ఎన్నికలకు సహకరించొద్దన్న ప్రవీణ్ ప్రకాష్ చేసిన సూచనల కారణంగానే అధికారులు ఎన్నికలకు ఏర్పాట్లు చేయలేదని పేర్కొన్నారు. ప్రవీణ్ ప్రకాష్ కారణంగానే తొలి విడత ఎన్నికలను రీ-షెడ్యూల్ చేయాల్సి వచ్చిందన్న ఎస్ఈసీ, రంగారెడ్డి, విశాఖ జిల్లాల కలెక్టరుగా ఉన్నప్పుడు కూడా ప్రవీణ్ ప్రకాష్ ఎన్నికల విధులు సరిగా నిర్వర్తించలేదని లేఖలో పేర్కొన్నారు నిమ్మగడ్డ. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులతో ప్రవీణ్ ప్రకాష్ ఎలాంటి సంప్రదింపులు జరపకుండా నిషేధం విధించాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు.