ఏడాది క్రితం తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్ళీ సొంత గూటికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం కూలిపోయే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. తాజాగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన… పార్టీని వదలిపెట్టి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలు వెనక్కి వచ్చి తిరిగి జేడీఎస్‌లో చేరాలని కోరుకుంటే ఆ అంశాన్ని పార్టీ పరిశీలిస్తుంది. పొరపాటు చేసినట్టు అంగీకరిస్తే వారిని తిరిగి పార్టీలో చేర్చుకునే వీలుందని బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. వాస్తవానికి బిజెపిలోకి మంత్రి పదవులు ఆశించి వెళ్ళారు కొందరు ఎమ్మెల్యేలు.
ఇప్పుడు వారికి ముఖ్యమంత్రి యడ్యూరప్ప మంత్రి పదవులు ఇచ్చే మాదిరి కనపడటం లేదు. దీనితో సొంత ఇంట్లోనే బిసి బెలా బాత్ తినడానికి ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. మొత్తం 11 మంది వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. 17 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో గత ఏడాది అతిపెద్ద పార్టీగా ఉన్న బిజెపి అధికారం చేపట్టింది. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని కాపాడుకుంది.
ఆ తర్వాత వాళ్ళపై అప్పటి స్పీకర్ రమేష్ కుమార్… అనర్హత వేటు వేయగా వాళ్ళకు మళ్ళీ బిజెపి సీట్లు ఇచ్చింది. గురువారం అక్కడ మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. ఈ నేపధ్యంలో తమకు బెర్తులు దక్కకపోతే సొంత పార్టీలోకి వచ్చేయడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారని, త్వరలో వాళ్ళు వచ్చేసే అవకాశం ఉందని జెడిఎస్, కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నాయి. దీనితో మళ్ళీ కర్నాటకం మొదలయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.