ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతీ ఒక్క నటీ నటుడు అనుకుంటారు. ప్రస్తుతం శంకర్ ప్యారలల్ గా రెండు సినిమాల షూటింగ్స్ చేయబోతున్నారు. ఓ వైపున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RC 15 ఫిల్మ్ చేస్తూనే మరో వైపున లోక నాయకుడు కమల్ హాసన్ తో ‘భారతీయుడు-2’ షూట్ చేయబోతున్నారు.
‘ఇండియన్-2’ పిక్చర్ షూటింగ్ పలు కారణాల వలన ఆగిపోయింది. ఇటీవల షూట్ మళ్లీ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఈ సంగతులు అలా పక్కనబెడితే.. దర్శకుడు శంకర్.. రామ్ చరణ్ తో సినిమా చేయడం పట్ల మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మెగాస్టార్ చిరంజీవియే స్వయంగా దర్శకుడు శంకర్ ను తనతో ఒక పిక్చర్ చేయాలని అప్పట్లో కోరారట.
చిరంజీవి తనతో సినిమా చేయాలని కోరినప్పటికీ ఆయనను పక్కనబెట్టి ఆయన తనయుడు రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నారు దర్శకుడు శంకర్. ‘జెంటిల్ మెన్’ చిత్రం వచ్చినప్పటి నుంచి తాను శంకర్ దర్శకత్వంలో పని చేయాలని అనుకున్నానని ఓ సందర్భంలో చిరంజీవి చెప్పారు.
కార్తీక్ సుబ్బరాజ్ అందించిన స్టోరితో ఈ ఫిల్మ్ చేస్తున్నారు శంకర్. కియారా అద్వానీ ఇందులో హీరోయిన్ కాగా, సునీల్, శ్రీకాంత్ , అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘అధికారి’ అనే టైటిల్ ను ఈ సినిమాకు లాక్ చేసినట్లు తెలుస్తోంది.
శంకర్ రామ్ చరణ్ తో ఈ సినిమా చేస్తూనే ప్యారలల్ గా ‘ఇండియన్-2’ చేయబోతున్నారు. ఇందులో కమల్ హాసన్ హీరో కాగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నది. ఈ రెండు చిత్రాల తర్వాత శంకర్.. బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణ్ వీర్ సింగ్ తో ‘అపరిచితుడు’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు.