అజిత్ పవార్ తిరుగుబాటు వర్గం తన ఫోటో వాడుకోవడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ సీరియస్ అయ్యారు. తన అనుమతి లేకుండా తన ఫోటో వాడుకోరాదని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. అజిత్ పవార్ వర్గం ముంబైలో ఎన్‌సీపీ కార్యాలయాన్ని మంగళవారంనాడు ప్రారంభించింది. ఇందుకు సంబంధించిన ఫోటోను ఆయన కార్యాలయం షేర్ చేసింది. అందులో శరద్ పవార్ ఫోటో అందులో కనిపించడంతో ఆయన ఘాటుగా స్పందించారు.
ముంబైలో విలేకరులతో మాట్లాడుతూ… తన భావజాలానికి ద్రోహం చేసినవారు, తన అభిప్రాయాలతో విభేదించేవారు, సైద్ధాంతిక విభేదాలున్నవారు తన ఫోటోను ఉపయోగించవద్దని స్పష్టం చేశారు. తాను జాతీయ అధ్యక్షుడిగా, జయంత్ పాటిల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎన్సీపీ మాత్రమే తన ఫోటోను ఉపయోగించుకోవాలన్నారు. తన ఫోటోను ఎవరు ఉపయోగించుకోవాలో నిర్ణయించే హక్కు తనదేనని, తన అనుమతి తప్పనిసరి అన్నారు.