జగన్ తెగ ఖర్చులు పెట్టేస్తున్నారు.. ఖజానా అంతా సంక్షేమం పేరున ప్రజలకు పంచేస్తున్నారు.. సంక్షేమ పథకాలు ఎక్కువగా చేసేస్తే.. ఏపీ కూడా వెనిజులా లా తయారవుతుంది అని సోషల్ మీడియా వేదికగా తెగ హల్ చల్ చేస్తున్నారు ఒక వర్గం జనాలు! ప్రస్తుతం టీడీపీ నేతలు కూడా ఇదే విషయాలు చెప్పుకుంటూ హడావిడి చేస్తున్నారు! ఇంతకూ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రానికి లాభమా నష్టమా ఇప్పుడు చూద్దాం!
జగన్ సర్కార్ ఏడాది కాలంలో అక్షరాలా 60 వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. ఇది పూర్తిగా తప్పు అనేది టీడీపీ వాదన. ఇలా అడిగినవారికీ అడగనివారికీ ఇచ్చిపుచ్చుకుంటూపోతే ఖజానా ఖాళీ అనేది టీడీపీ బలమైన బహిరంగ వాదన. కానీ ఈ కరోనా టైంలో రూపాయి సంపాదన లేని సమయంలో జగన్ ప్రజలను ఈ రేంజ్ లో ఆదుకుంటూపోతే… 2024 ఎన్నికల్లో ఫలితాలు 2019 ఎన్నికలకు మించి ఉంటాయనేది ఇంటర్నల్ ఫీలింగ్ అని చెప్పొచ్చు!
ఇదే క్రమంలో… రాజ్యాంగంలో రాసుకున్నట్లుగా చూసుకుంటే మనది సంక్షేమ రాజ్యం. ఇప్పుడు జగన్ చేస్తోంది తప్పు అయితే… సుమారు 40ఏళ్ల క్రితమే రెండు రూపాయలకు కిలో బియ్యం అని ప్రకటించి.. పేదోడి ఆకలి తీర్చుకోవడానికి సహకరించిన ఎన్టీఆర్ చేసిన పని? అంతేందుకూ బాబు గత అయిదేళ్ల పాలనలో అన్న క్యాంటీన్ పేరుచెప్పి బయట హోటల్లో 80 రూపాయలు ఉండే భోజనాన్ని ఐదు రూపాయలకే ఇచ్చి చేసిందేమిటి? ఇవన్నీ సంక్షేమ పథకాలు అని చెప్పుకున్నప్పుడు.. పేదోడి ఆకలి తీర్చడానికి అని ప్రకటించుకుంటున్నప్పుడు… జగన్ చేసేది తప్పెలా అవుతుంది.
పైగా… ఇది కరోనా కాలం. ప్రజలు ఇక్కట్లతో కొట్టిమిట్టాడుతున్న సమయం. మరి ఇలాంటప్పుడు జగన్ చేస్తోంది అక్షరాల అక్షర సత్యం అనేది సామాన్యుల మాటగా ఉంది! దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుష్యులోయ్ అన్నప్పుడు… ఆ వాక్యం రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది కదా! రాష్ట్రం ఇబ్బందుల్లోకి వెళ్లిపోతుంది అంటే.. ప్రజలను విస్మరించాల… విమర్శించేవారికే తెలియాలి!!
-CH Raja