రాష్ట్రంలో రెండు రోజులుగు జరుగుతున్న అనూహ్య పరిణామాలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. మంత్రి ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు వచ్చినప్పటి నుంచి శరవేగంగా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడం.. 24గంటల్లోనే విచారణ జరిపి నివేదిక సమర్పించడం చకచకా జరిగిపోయాయి. ఆ వెంటనే శాఖను బదిలీ చేయడం, నిన్న బర్తరఫ్ చేయడం వరకు అంతా సైలెంట్ గా జరిగిపోయింది. దీంతో టీఆర్ ఎస్ లో రాజకీయ సంక్షోభం మొదలైంది. ఇక ఈటల తాను ఎలాంటి తప్పు చేయలేదని, సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఇదిలా ఉండగా.. ఆయన రాజకీయ భవితవ్యం ఏంటనేది ఇప్పుడు పెద్ద ఉత్కంఠగా మారింది. స్వయంగా కేసీఆర్ తన శాఖను తీసుకోవడంతో.. తాను కేసీఆర్ ను కలవను అని ఈటల చెప్పడంతో ఈ సమస్య పెద్దదయింది. దీంతో ఇప్పుడు ఆయన టీఆర్ ఎస్ లో కొనసాగుతారా.. లేక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికకు వెళ్తారా అనే సందేహాలు వెలువడుతున్నాయి. తనకు మంత్రి పదవి ఎక్కువ కాదని చెప్పినా ఆయన.. కేసీఆర్ బర్తరఫ్ చేసే వరకు ఓపిగ్గా ఎదురుచూసి సింపతీని కూడగట్టుకున్నారు.
ఇక వరుసగా హూజూరాబాద్ నాయకులు, కార్యకర్తలతో చర్చలు జరుపుతున్నారు. వారితో చర్చలు పూర్తియిన తర్వాత తన రాజకీయ భవితవ్యం ప్రకటించనున్నారు. అయితే ఏ పార్టీలో చేరనని, పార్టీ కూడా పెట్టనని ఆయన ప్రకటించారు. దీంతో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా.. లేక ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది వేచి చూడాలి. కాగా ఆయన అభిమానులు మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేయాలని కోరుతున్నారు. అప్పుడే ఆత్మగౌరవం నిలుస్తుందని తెలుపుతున్నారు. చూడాలి మరి ఈటల ఎటువైపు పయనిస్తారో.