జర్నలిస్టు సిద్దీఖ్ కప్పన్‌కు బెయిల్ మంజూరైనా జైల్లోనే ఉండనున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కి సంబంధించిన ఓ కేసు పెండింగ్‌లో ఉందని.. ఆ విచారణ నేపథ్యంలో కప్పన్‌ను విడుదల చేయడంలేదని జైలు అధికారులు వెల్లడించారు. యూపీలోని హాథ్రస్‌లో 2020లో సామూహిక అత్యాచారానికి గురై మృతిచెందిన దళిత యువతి ఉదంతాన్ని కవర్ చేసేందుకు వెళుతూ కప్పన్ అరెస్టయ్యారు. ‘ఈడీ విచారిస్తున్న కేసు ఇంకా పెండింగ్‌లో ఉన్న నేపత్యంలో కప్పన్ జైలు నుంచి విడుదల చేయడం లేదు’ అని జైళ్ల శాఖ డీజీ పౌరసంబంధాల అధికారి సంతోష్ వర్మ వెల్లడించారు.
అసలేం జరిగిందంటే.. 2020 సెప్టెంబరు 14న ఓ దళిత యువతిపై ఆమె గ్రామానికే చెందిన నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె దిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. అయితే ఈ ఘటన తర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాధితురాలి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చిన పోలీసులు అర్ధరాత్రి హడావుడిగా దహన సంస్కారాలు చేయడం వివాదాస్పదంగా మారింది.
ఈ ఘటనపై పరిశోధనాత్మక కథనాన్ని కవర్ చేసేందుకు కేరళకు చెందిన సిద్దీఖ్ కప్పన్ యూపీకి బయల్దేరగా.. మార్గమధ్యంలోనే అడ్డుకున్న యూపీ పోలీసులు చట్టవిరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టం కింద అరెస్టు చేశారు. తరువాత ఈడీ సైతం ఓ కేసు నమోదు చేసింది.