నూతన ప్రైవసీ పాలసీ వల్ల వాట్సాప్‌కు ఇప్పటికే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది యూజర్లు వాట్సాప్‌ను వదిలిపెట్టి టెలిగ్రామ్, సిగ్నల్ వంటి యాప్‌లకు మారారు. అయితే టెలిగ్రామ్ కన్నా సిగ్నల్ యాప్ ఈ విషయంలో చాలా ముందుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే త్వరలో సిగ్నల్ యాప్ వాట్సాప్‌ను ఢీకొనేందుకు గాను వాట్సాప్ తరహాలో ఫీచర్లను అందుబాటులోకి తేనున్నట్లు తెలిసింది.
వాట్సాప్‌లో ఉన్న కస్టమ్ వాల్‌పేపర్స్, అబౌట్ స్టేటస్, యానిమేటెడ్ స్టిక్కర్స్, స్టార్డ్ చాట్స్, లో డేటా మోడ్, కాంటాక్ట్ సజెషన్, డౌన్‌లోడ్ ప్రిఫరెన్సెస్, గ్రూప్ కాల్స్ వంటి ఫీచర్‌లను సిగ్నల్ తన యూజర్లకు అందుబాటులోకి తెచ్చే పనిలో పడినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆయా ఫీచర్లను సిగ్నల్ మే నెల వరకు అందిస్తుందని తెలిసింది.
వాట్సాప్‌లో గ్రూప్ కాలింగ్ చేసుకునేందుకు యూజర్ల పరిమితి 8 వరకు ఉండగా, సిగ్నల్ యాప్ ఇటీవలే దాన్ని 5 నుంచి 8 కి పెంచింది. దీంతో వాట్సాప్ తరహాలోనే ఫీచర్లను యూజర్లకు అందివ్వాలని సిగ్నల్ ఆలోచిస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఇప్పటికే వాట్సాప్ నుంచి పెద్ద ఎత్తున యూజర్లు సిగ్నల్‌కు మారినందున వారు మళ్లీ ఫీచర్లు లేని కారణంగా తిరిగి వాట్సాప్‌కు మారకూడదనుకుంటే సిగ్నల్ కచ్చితంగా ఆయా ఫీచర్లను త్వరగా యూజర్లకు అందివ్వాల్సి ఉంటుంది. అందుకనే సిగ్నల్ ఈ దిశగా ప్రస్తుతం చర్యలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.