భారత మహిళల డబుల్స్ స్టార్ షట్లర్ సిక్కి రెడ్డికి కరోనా నెగటివ్ వచ్చింది. అయితే నిజానికి సిక్కి రెడ్డి, పుల్లెల అకాడమీలో ఫిజియోతెరఫిస్ట్ కిరణ్ జార్జ్ కు మొన్న గురువారం కరోనా పాజిటివ్ అని తేలింది. అది పాజిటివ్ అని తెలినప్పుడే ఇద్దరికీ లక్షణాలు లేవు ఆరోగ్యంగా ఉన్నారని ఆరోజే పేర్కొన్నారు. ఇక గోపిచంద్ అకాడమీలో సిక్కిరెడ్డి ప్రాక్టీస్ కూడా చేస్తుండడంతో అకాడమీని క్లోజ్ చేసి అధికారులు శానిటైజ్ చేశారు. అదే అకాడమీలో పివి సిందు, కశ్యప్, సైనా తదితరులు ప్రాక్టీస్ చేస్తున్నారు. గురువారం ఉదయం గోపీచంద్ అకాడమీలో సిక్కి రెడ్డి ప్రాక్టీస్ చేసింది, అదే రోజు సాయంత్రానికి సిక్కి రెడ్డికి పాజిటివ్ రావడంతో ఇతర ప్లేయర్స్ లో టెన్షన్ నెలకొంది.
సిక్కితో కలిసి ప్రాక్టీస్ చేసిన సింధు, కశ్యప్, సైనాలకు టెన్షన్ పట్టుకుంది. అయితే నాలుగు రోజుల్లో నెగటివ్ ఎలా వచ్చిందా అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే విషయం ఏంటంటే ఈ నెల 7న గోపీచంద్ అకాడమీలో జాతీయ శిక్షణ శిబిరం ప్రారంభమైన సందర్భంగా సాయ్ నిబంధనల ప్రకారం శిబిరంలో ఉన్న క్రీడాకారులకు, కోచ్‌లకు, సహాయక సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో సిక్కి రెడ్డి, కిరణ్‌లకు కరోనా పాజిటివ్ రాగా… ఇతరులకు నెగెటివ్ వచ్చింది. అయితే పాజిటివ్ వచ్చిన సిక్కి రెడ్డి, కిరణ్‌లో కరోనా లక్షణాలు లేకపోవడంతో మరుసటి రోజే కార్పొరేట్ ఆసుపత్రిలో శిబిరంతో సంబంధమున్న వారందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఇందులో సిక్కి రెడ్డి, కిరణ్‌లకు కరోనా ‘నెగెటివ్’ ఫలితం వచ్చింది.