మీ సిమ్ ఉన్నట్టుండి పనిచేయడం ఆగిపోయిందా ? అస్సలు అశ్రద్ధ చేయకండి, వెంటనే మీ నెట్ వర్క్ ఆపరేటర్ ని సంప్రదించండి. ఎందుకంటే ఏమాత్రం లైట్ తీసుకున్నా మీ బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బు మాయం అయ్యే అవకాశం ఉంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి తెలంగాణాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే సిమ్ క్లోన్ చేసి 19 లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు. సికింద్రాబాద్ కు చెందిన ఆనంద్ అనే వ్యాపారవేత్త ఎలక్ట్రికల్ కంపెనీ నడిపిస్తున్నాడు.
ఈ నెల 6వ తేదీన సిమ్ బ్లాక్ అవడంతో దగ్గర్లో ఉండే కస్టమర్ కేర్ సంప్రదించాడు. నెట్వర్క్ ప్రాబ్లం వల్ల అలా జరిగి ఉండొచ్చని ఉదయం వరకు అయిపోతుందని చెప్పడంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. అయితే పని ఒత్తిడిలో పడి సిమ్ విషయం మర్చిపోయాడు. తీరా సిమ్ క్లోన్ అయ్యిందని తేలింది. ఈ సిమ్ క్లోన్ చేసిన సైబర్ నెరగాళ్లు ఏకంగా 19 లక్షలు కొల్లగొట్టారు. దీంతో ఈ రోజు ఉదయం తన బ్యాంక్ ఖాతాలో వున్న డబ్బులు మాయం అయ్యాయని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఈ క్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సైబర్ పోలీసులు.