సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానానికి అరుదైన గౌరవం దక్కింది. ‘ప్రసాద్’ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు ప్రఖ్యాత తీర్థయాత్ర స్థలాలను ఎంపిక చేసి అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా సింహాచలం దేవస్థానాన్ని ఎంపిక చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై దేవస్థానం చైర్మన్ సంచయిత గజపతి రాజు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ కు కృతజ్ఞతలు తెలిపారు.
మాన్సాస్ తో పాటు సింహాచలం ఆలయం బాధ్యతలు కూడా ఒకేసారి చేపట్టిన సంచయిత ఆ తర్వాత ఈ ఆలయం అభివృద్ధికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో తన బాబాయ్ నెలకొల్పిన పలు సంప్రదాయాలను మార్చడంతో పాటు అధికారులకు కూడా స్వేచ్ఛనిచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆలయ అభివృద్ధికి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఇప్పుడు ప్రసాద్ పథకానికి కూడా ఎంపిక కావడంతో ఇక సింహాచలం ఆలయ ప్రతిష్ట మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.