మనకు నిద్ర ఎంత ఆవశ్యకమో అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క వ్యక్తి నిత్యం తగినన్ని గంటల పాటు నిద్రించాల్సిందే. నిద్ర వల్ల శరీరానికి నూతనోత్తేజం కలుగుతుంది. కొత్త శక్తి వస్తుంది. మరుసటి రోజు పనిచేసేందుకు కావల్సిన శక్తి లభిస్తుంది. అయితే నేటి ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో చాలా మంది నిద్ర సరిగ్గా పోవడం లేదు. దీంతో అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
అయితే చాలా మంది నిద్ర ఒక్కరోజు పోకపోతే ఏమవుతుంది ? ఏమీ కాదులే.. అన్న భావనలో ఉన్నారు. కానీ అది సరికాదట. ఎందుకంటే.. ఒక్క రోజు సరిగ్గా నిద్రపోకపోయినా దాని ప్రభావం మనపై పడుతుందట. ముఖ్యంగా మన శరీరంలో కణజాలంపై నిద్ర ప్రభావం పడుతుందట. సైంటిస్టులు తాజాగా చేసిన ఓ పరిశోధనలో ఈ విషయం తెలిసింది. శరీరంలో కండరాలు బలహీనం అవడం, కొవ్వు స్థాయిలు అధికం కావడం వంటి సమస్యలు నిద్రలేమి వల్లే వస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు.
నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీకి చెందిన ఓ పరిశోధక బృందం కణస్థాయిలో నిద్రలేమి ప్రభావం ఎలా ఉంటుందన్న అంశంపై అధ్యయనం చేసింది. ఈ క్రమంలో ఆ సైంటిస్టులకు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఒక్కరోజు నిద్ర సరిగ్గా పోకపోయినా ఆ ప్రభావం శరీరంలోని కణజాలంపై పడుతుందట. దీంతో టైప్ 2 డయాబెటిస్, స్థూలకాయం తదితర సమస్యలు వస్తాయట. 15 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తులపై సైంటిస్టులు ఈ పరిశోధన చేశారు. కనుక ఒక్కరోజే కదా, నిద్రపోకపోతే ఏం జరుగుతుందిలే.. అని ఎవరూ అనుకోవద్దు. రోజూ కచ్చితంగా తగినన్ని గంటల పాటు నిద్రించాల్సిందే. లేదంటే పైన చెప్పాం కదా.. డయాబెటిస్, స్థూలకాయం వంటి అనారోగ్య సమస్యలు వచ్చేందుకు పొంచి ఉంటాయి.