దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ.. మరీ ముఖ్యంగా మరికొద్ది రోజుల్లోనే ఢిల్లీకి కూతవేటు దూరంలోని బిహార్‌లో ఎన్నికలకు రంగం సిద్ధమైన వేళ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రాజకీయ కాక రేగుతోందా ? ఎన్డీయే పక్షాల్లోనే చీలిక వస్తోందా ? ఆయన పాలనపై అసంతృప్తి పెల్లుబుకుతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. తాజాగా ఢిల్లీలో మారిన పరిణామాలను అంచనావేస్తున్న విశ్లేషకులు కూడా మోడీ ప్రభావంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రధాన పార్టీ శిరోమణి అకాలీదళ్ ఎంపీ.. హరిసమ్రత్ కౌర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే, ఈ పరిణామాన్ని తేలికగా తీసుకునే అవకాశం లేదని అంటున్నారు పరిశీలకులు. సుదీర్ఘకాలం నుంచి శిరోమణి అకాలీదళ్‌తో బీజేపీకి పటిష్టమైన బంధం ఉంది. ఆరు సంవత్సరాలుగా అంటే.. గత మోడీ పాలన నుంచి కూడా ఈ పార్టీ ఆయనకు ప్రధాన మద్దతుదారుగా ఉంది. అయితే, తాజాగా తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లు ద్వారా రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుందని.. పంజాబ్ ఎప్పటి నుంచో చెబుతోంది.
అయితే, తన మాటకు , చేతలకు ఎవరూ అడ్డు చెప్పలేరనే ధోరణితో ఉన్న మోడీ.. మిత్రపక్షాలను పక్కన పెట్టి మరీ.. ఈ బిల్లును తీసుకువచ్చారు. ఈ పరిణామాలతో పంజాబ్‌లో రైతాంగం అక్కడి ప్రభుత్వంపై తిరగబడింది. ఈ క్రమంలోనే తమ మంత్రి హర్ సిమ్రత్ కౌర్‌ని శిరోమణి అకాలీదళ్ వెనక్కి తీసుకుంది. హర్ సిమ్రత్ కౌర్ వ్యవసాయరంగంతో అనుబంధం ఉన్న ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కేబినెట్ మంత్రిగా ఉన్నారు. అయితే, కౌర్ రాజీనామా ప్రభావం.. మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్న బిహార్‌లో ప్రధానంగా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.
ఇప్పటికే అక్కడ కూడా ఎన్డీయే పక్షాల్లో మోడీపై అసంతృప్తి కొనసాగుతోంది. ఇక, ఎల్‌జేపీ అధ్యక్షుడిగా ఉన్న రాం విలాస్ పాశ్వాన్ తనయుడు.. సొంతంగా సీఎం అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. ఈ పరిణామాలు కూడా ఎన్డీయే ను ఇబ్బందిలోకి నెట్టింది. మరోపక్క, చైనాతో భారత్ అవలంభిస్తున్న తీరుపైనా మిత్రపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. ఏం జరుగుతోందో చెప్పకుండా దాగుడుమూతల వైఖరిని అవలంబిస్తుండడంపై ఆగ్రహంతో ఉన్నాయి. ఇలా ఎలా చూసినా.. త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం చుట్టుముట్టిన సమ్యలు మోడీకి ఇబ్బందేనని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.
-Vuyyuru Subhash