అక్కంటే అమ్మలో సగం అంటారు కదా. ఆ మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఓ అక్క. తమ్ముడంటే పంచ ప్రాణాలు అని నిరూపించింది. తన ప్రాణం అడ్డు పెట్టయినా సరే తమ్ముడిని కాపాడుకుంటాని చేసి చూపించింది. చివరికి తన ప్రాణం పోతుందని తెలిసినా.. తమ్ముడికి ఊపిరి పోసింది. వినడానికి సినిమాటిక్ గా ఉన్నా ఇది నిజమేనండి. కళ్లకు కన్నీల్లు తెప్పించే ఘటన ఇది.
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం ఆకులతంపర గ్రామంటో నక్క భాస్కరరావు, సుజాత దంపతులు జీవిస్తున్నారు. వీరికి ప్రశాంతి(13 ), దినేష్(10 ) అనే ఇద్దరు పిల్లలు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ. అయితే రెండు రోజుల క్రితం ఇద్దరూ పొలం దగ్గర్లోని వంశధార నదిలోని నీరు తెచ్చుకొనే రేవు దగ్గర స్నానం చేయడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు దినేశ్ లోతున్న ప్రదేశంలోకి వెళ్లి మునిగిపోసాగాడు. ఇది గమనించిన ప్రశాంతి.. ఏ మాత్ర ఆలోచించకుండా తమ్ముడిని ఒడ్డుకు చేర్చేందుకు శతవిధాలా ప్రయత్నించింది. తన ప్రాణం పోతుందని తెలిసినా.. తమ్ముడిని కాపాడేందుకు పోరాడింది. చివరికి తమ్ముడిని ఒడ్డుకు చేర్చి ఊపిరి పోసింది.
కానీ తాను మాత్రం నీళ్లు మింగింది. వెంటనే స్థానికులు గమనించి హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మద్యమంలో చనిపోయింది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎంత సాహసం చేసిందో కదండి. తమ్ముడి ప్రాణం కన్నా తన ప్రాణం ఎక్కువ కాదని నిరూపించింది. తాను అక్కను కాదని.. తల్లినని చెప్పకనే చెప్పింది. తమ్ముడికి మరో జన్మ ఇచ్చి నిజంగానే అమ్మ అయింది కదూ.