రైతులకు స్కైమెట్ వాతావరణ సంస్థ బ్యాడ్‌న్యూస్ చెప్పింది. ఈ ఏడాది వర్షాకాలంలో అంతగా వర్షాలు కురవకపోవచ్చునని తెలిపింది. ఈ సంస్థ అంచనాల ప్రకారం ఈ ఏడాది అన్నదాతకు అంత అనువుగా వాతావరణ పరిస్థితులు లేవట. ఈ వానాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవ్వడానికి ఎక్కువ అవకాశాలున్నాయట. అంతేకాదు.. దేశంలో కొన్ని ప్రాంతాల్లో కరవు తాండవించే పరిస్థితులూ ఉన్నాయట. 20% కరవును స్కైమెట్ అంచనా వేస్తోంది.
గత 4 సంవత్సరాలుగా సాధారణ, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్న పరిస్థితుల్లో ఈ తాజా అంచనాలు.. వ్యవసాయరంగానికి దెబ్బే. జూన్ నుంచి సెప్టెంబరు మధ్య నాలుగు నెలల కాలానికి వర్షపాతం దీర్ఘకాల సగటు 868.6 మిల్లీ మీటర్లు. ఇందులో 94 శాతం మాత్రమే ఈసారి పడే అవకాశం ఉందని ‘స్కైమెట్’ చెబుతోంది.
వర్షాకాలానికి కీలకమైన జులై ఆగస్టుల్లో ఉత్తర, మధ్య భారతాన్ని వరుణదేవుడు అంతగా కటాక్షించే అవకాశాల్లేవు. ఈ ప్రభావం గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఎక్కువ కనిపించనుంది. ఉత్తర భారత వ్యవసాయానికి కీలకమైన పంజాబ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్‌ల్లో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదు కానుంది.