షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. భారతదేశంలో షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. షుగర్ కారణంగా వచ్చే ఇతర అనారోగ్యాలకి గురవుతున్నవారు అధిక సంఖ్యలోనే ఉన్నారు. ఐతే షుగర్ వ్యాధికి కారణం చక్కెర పదార్థాలని ఎక్కువగా తీసుకోవడమే నమ్ముతారు. అది నిజమే అయినప్పటికీ అదొక్కటే కారణం కూడా కాదని వైద్యులు చెబుతున్నారు. అస్తవ్యస్త జీవన విధానం కూడా చక్కెర వ్యాధి పెరగడానికి దోహదపడుతుందని తెలియజేస్తున్నారు.
అందుకే చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోవడానికి జీవన విధానంలో మార్పు తీసుకురావడం ద్వారా సాధ్యమవుతుందని అంటున్నారు. జీవన విధానంలో భోజనంలో మార్పులు, నిద్రలేకపోవడం, సరైన సమయానికి తిండిలేకపోవడం వంటి వాటి కారణంగా షుగర్ వ్యాధి విజృంభిస్తుందని వాటిని మార్చుకుంటే డయాబెటిస్ ని అదుపులో ఉంచుకోవచ్చని చెబుతున్నారు.
ముందుగా సరైన సమయంలో భోజనం చేయాలి. ఆకలి అవుతున్నపుడే ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఆకలి పూర్తిగా చచ్చిపోయిన తర్వాత తినకూడదు. అలాగే బిస్కట్స్, మప్ఫిన్స్, కుకీస్ వంటి వాటిలో కార్బో హైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది.
వ్యాయామం ఖచ్చితంగా చేయాలి. చాలామంది ఈ విషయంలో అలసత్వం ప్రదర్శిస్తారు. కానీ వ్యాయామం వల్ల శరీరంలో చక్కెర శాతం నియంత్రణలో ఉంటుంది.
సరైన నిద్ర. నిద్రలేమి వల్ల ఎక్కడ లేని జబ్బులన్నీ చుట్టుకుంటాయి. ఎంత పనిచేసామన్నది ముఖ్యం కాదు, కొంతైనా విశ్రాంతి తీసుకున్నావా లేదా అన్నదే ముఖ్యం. విశ్రాంతి లేకుండా పనిచేస్తే విరామం లేని జబ్బులు వచ్చి చేరతాయి.
ఈ మూడు విషయాలని జాగ్రత్తగా పాటిస్తే షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది.