కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె షనెల్ ఇరానీ తన ప్రియుడు అర్జున్ భల్లాతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహ వేడుక రాజస్థాన్ జోధ్‌పుర్‌లో 15వ శతాబ్దం నాటి ఖిన్వ్సర్ రాజకోటలో ఘనంగా జరిగింది. గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో వధూవరులు పూలమాలలు మార్చుకున్నారు. ఆ సమయంలో రాజకోటపై బాణాసంచా కాల్చారు.
షనెల్ పరిణయానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. షనెల్ వివాహ వేడుకలకు వచ్చిన అతిథులకు రాజస్థాన్ సంప్రదాయ ఆచారాలతో స్వాగతం పలికారు. నో ఫోన్ విధానాన్ని అమలు చేశారు. వివాహ ప్రాంగణంలోకి ఎవరూ ఫోన్ తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కేంద్రమంత్రి కుమార్తె పెళ్లి సందర్భంగా రాజకోట పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.
బుధవారం ఉదయం స్మృతి ఇరానీ.. జోధ్‌పుర్ చేరుకున్నారు. మాజీ మంత్రి ఖిన్వసార్.. స్మృతి ఇరానీ కుమార్తె పెళ్లి వేడుకల పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. కాగా, స్మృతి ఇరానీ కుమార్తె షనెల్కు అర్జున్ భల్లాతో 2021 డిసెంబరులో నిశ్చితార్థం జరిగింది. ముంబయిలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో లా కోర్సు పూర్తి చేసిన షనెల్.. ఆ తర్వాత వాషింగ్టన్ డీసీలోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎమ్ పట్టా పొందారు. షనెల్ ఇరానీకి కాబోయే భర్త అర్జున్ భల్లా కెనడాలో నివసిస్తున్నారు.