ఐసిస్‌ బగ్దాదీ చావుకు కారణమైన హీరో – కొనన్‌ ది డాగ్‌

-

‘బహుశా ఇది ప్రపంచంలోనే అతి ప్రసిద్ధి చెందిన కుక్క’ అని అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్‌ ట్రంప్‌ ప్రశంసించారు. కోనన్‌ అని పిలువబడే ఈ శునకం, ఐసిస్‌ అధినేత అబు బకర్‌ అల్‌ బగ్దాదీని తరిమి తరిమి చావును చూపించింది.

ప్రపంచాన్నే గడగడలాడించిన ఐసిస్‌ తీవ్రవాద సంస్థ నాయకుడు బగ్దాదీని తుదముట్టించడంలో, అమెరికన్‌ కమెండోలకు ఎంతో సహాయపడ్డ శునకం, ‘కొనన్‌’ను యుఎన్‌ అధ్యక్షుడు ట్రంప్‌ సత్కరించారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఈ హీరో డాగ్‌ బెల్జియన్‌ మాలినాయిస్‌ జాతికి చెందినది.

బగ్దాదీ (48), మొన్న అక్టోబరులో శిక్షణ పొందిన శునకాలతో సహా అమెరికా ప్రత్యేక దళాలు వెంబడించి పరుగులు పెట్టించినపుడు వేరే దారిలేక తనను తాను పేల్చేసుకుని చచ్చిపోయాడు. ఒక సొరంగంలోకి పారిపోతున్న బగ్దాదీని వెంటబడి తరిమిన కొనన్‌, అద్భుతమైన ధైర్యసాహసాలు ప్రదర్శించింది. బగ్దాదీ ఎన్ని రకాలుగా బెదిరించినా చెదరకుండా, తనను ఎటూ కదలకుండా నిలువరించింది. ఇంతలో వెనుకనుండి కమెండోలు వస్తున్న అలికిడి గమనించిన బగ్దాదీ, ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో, ఒంటికి చుట్టుకున్న బాంబుల బెల్టును పేల్చుకున్నాడు. ఆ పేలుడులో బగ్దాదీ, తన కుమారుడు చిధ్రమైపోయారు.

ఆ సంఘటనలో గాయపడి, కోలుకున్న సైనిక శునకం ‘కొనన్‌’ సోమవారం అధ్యక్షుడు ట్రంప్‌ను వైట్‌హౌస్‌లోని తన ఓవల్‌ ఆఫీసులో కలుసుకుంది. ఆ తరువాత, ప్రెసిడెంట్‌, ప్రథమ మహిథ మెలానియా, వైస్‌ ప్రెసిడెంట్‌ మెక్‌ పెన్స్‌తో కలిసి రోజ్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నది. ‘బహుశా ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిన శునకం’గా పరిచయం చేసిన ట్రంప్‌, కొనన్‌కు జ్ఞాపికనందించి సత్కరించారు, ఎంతో తెలివైనది, ఎంతో చలాకీ అయిన జంతువు అంటూ కొనియాడిన ట్రంప్‌, కరుడుగట్టిన తీవ్రవాదిపై మచ్చలేని దాడిలో, మరువలేని సాయం చేసిందని పదే పదే ప్రశంసించారు.

ఈ సందర్భంగా, ప్రెసిడెంట్‌ ట్రంప్‌, ఆనాటి దాడిలో పాల్గొన్న ప్రత్యేక దళాలను కూడా కలుసుకున్నారు. ఆ కమెండోలు ఎవరో అమెరికా ప్రభుత్వం ప్రజానీకానికి తెలియనివ్వడంలేదు. కమెండోలు, కొనన్‌ ఒక అద్భుతమైన కార్యం నెరవేర్చారని, ప్రత్యేకించి కొనన్‌ జాతి పోరాటంలోనూ, మాదకద్రవ్యాలను పనిగట్టడంలోనూ అసమాన ప్రతిభ కనబరుస్తాయని గుర్తు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news