ముఖ్యమంత్రి జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని… ఆయన భార్య వైఎస్.భారతి త్వరలో ఏపీ సీఎం కాబోతున్నారని ఏపీ రాజకీయ వర్గాలు, సామాన్య ప్రజల్లోనూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇందులో నిజమెంత అన్నది ఆదేవుడికే తెలియాలి. ఇక సోషల్ మీడియాలో అయితే ఎవరికిష్టం వచ్చిన రీతిలో వారు అభిప్రాయం చెప్పేసి… జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని కొందరు…కాదు జరగబోదని మరికొందరు ఇలా చర్చలతో రచ్చరచ్చ చేసేస్తున్నారు. జగన్‌ను జైలుకు పంపి రాష్ట్రంలో పార్టీని విస్తృతం చేసుకునేందుకు..వైసీపీ, టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను, ముఖ్య నేతలను లాగేసుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతోందన్నది రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ప్రచారంలో ఉన్న అంశం.
ఇదంతా ఉట్టి ప్రచారమేనని కొంతమంది కొట్టిపారేస్తుండగా.. మరికొంతమంది మాత్రం గతంలో అనేక రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులనే కల్పించి బలపడిందని గుర్తు చేస్తున్నారు. బీజేపీ అంతిమ లక్ష్యం ఏపీలో అధికారంలోకి రావడమేనని అందుకు ఎలాంటి అవకాశాలను వదలబోదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొన్నటి ఎన్నికలకు ముందు వరకు అధికారంలో ఉన్న టీడీపీని ఓ రేంజ్‌లో టార్గెట్ చేసిన బీజేపీ ఆ పార్టీ ఓడిపోయిన వెంటనే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను తమ పార్టీలో చేర్చేసుకుంది.
ఇక ఇప్పుడు టీడీపీని ముందుగా నిర్వీర్యం చేస్తూనే అటు అధికార వైసీపీని టార్గెట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీలు కూడా బీజేపీలోకి వెళుతున్నారన్న మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. ఇదిలా ఉంటే జగన్ జైలుకు వెళ్తారట… అంటూ ఆయనకు వ్యతిరేక వర్గం మీడియా పుంకాను పుంకాలుగా కథనాలు ప్రచురితం కావడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారట. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం అంతర్గత సంభాషణల్లో జగన్ జైలుకెళతారనే అంశాన్ని ప్రస్తావించారంటూ కథనాల్లో పేర్కొనడం గమనార్హం. తాజాగా జగన్ జైలుకు వెళ్లడం ఖాయమనే ప్రచారం మరింత ముమ్మరమైంది. ఆయన వైఖరిపై ఆగ్రహంతో ఉన్న కమలనాథులు జగన్ ను జైలుకు పంపించడం ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తున్నారు.
ఇటీవల జగన్ సైతం బీజేపీ నుంచి రాష్ట్రానికి ఎలాంటి సహాయ, సహకారాలు లేకపోవడంతో బీజేపీ విషయంలో ఒకింత కఠినంగానే ఉంటున్నారంటున్నారు. అయితే ఇటీవల సీఎం హోదాలో జగన్.. ఏపీ గవర్నర్ తో భేటీ కావడానికి కూడా అదే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ తన భార్య భారతిని గవర్నర్ దంపతులకు పరిచయం చేయడానికే తీసుకెళ్లారని, ప్రస్తుతం ఆమెకు పాలనలో మెలకువలు నేర్పుతున్నారని, కాబోయే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆమెనని పేర్కొంటుండటం గమనార్హం. మరోవైపు జనంలో బలం లేని…బీజేపీ చర్యలు అంతిమంగా మళ్లీ టీడీపీకే లాభాదాయకంగా మారనున్నాయన్న వాదనను కొంతమంది వినిపిస్తున్నారు. మరి ఏపీ రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతాయో ? చూడాలి.