నేడే సోనియ అధ్యక్షతన ‘మహా’సభ

-

సోనియా చేతుల మీదుగా 116 పేజీల మేనిఫెస్టో..

ఒకే వేదికపై 200 మందికి పైగా…

తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇందులో భాగంగానే తెలంగాణ ఇచ్చిన తర్వాత తొలి సారి తెలంగాణకు వస్తున్న సోనియా గాంధీకి ఘన స్వాగతం పలుకనున్నారు. శుక్రవారం మేడ్చల్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో  సోనియా, రాహుల్‌ పాల్గొంటున్న సందర్భంగా తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇందుకుగాను మూడు లక్షలకు పైగా  భారీ స్థాయిలో జనసమీకరణ చేయనున్నట్లు తెలుస్తోంది.

సోనియా చేతుల మీదుగా 116 పేజీల మేనిఫెస్టో..
సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని ఈ సభ నుంచి రాష్ట్ర ప్రజలకు తెలియజేసే విధంగా కాంగ్రెస్‌ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా సభా వేదికపైనే భారీ ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు టీపీసీసీ పెద్దలు తెలిపారు. సభలో దాదాపు 45 నిమిషాల పాటు సోనియా ప్రసంగం చేయనున్నారు. రాహుల్‌ 20 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 116 పేజీల కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోను సోనియా ఆవిష్కరించనున్నారు. ప్రసంగంలో ప్రధానంగా తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్‌ పార్టీ తీసుకున్న నిర్ణయం, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలకు వివరించనున్నారు.

ఒకే వేదికపై 200 మందికి పైగా…

తెలంగాణలోని పోటీ చేయనున్నఅభ్యర్థులతో పాటు, వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు మొత్తం 200 మంది సభా వేదికపై కూర్చునేందుకు సిద్ధం చేశారు. కూటమిలో మిత్రపక్షాలుగా ఉన్న తెజస అధ్యక్షుడు కోదండరాం, తెతెదేపా అధ్యక్షుడు రమణ, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తదితరులు ఈ సభలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

భారీ భద్రత

జాతీయ స్థాయి ప్రముఖ నేతలతో పాటు, రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన అధ్యక్షులు పాల్గొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే బహిరంగ సభ ప్రాంగణంలో ఇప్పటికే స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్‌పీజీ) అడ్వాన్స్‌ సెక్యూరిటీ లైజన్‌ (ఏఎస్‌ఎల్‌) నిర్వహించింది.

తెరాస పై, కేసీఆర్ పై విరుచుకుపడే  తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి సభా నిర్వాహణ బాధ్యతలను అప్పగించడంతో  నాటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు కాస్త అలక పూనినట్లు సమాచారం. ఈ సభ వల్ల కాంగ్రెస్ కి వచ్చే లాభం ఏమో కానీ..సభ తర్వాత మాత్రం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు భయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news