తిరగేసిన లిల్లీ ఫ్లవర్ ఆకృతిలో ఏపీ నూతన అసెంబ్లీ డిజైన్!

-

Tenders will be called by this month end for ap new assembly consturction

* నూతన అసెంబ్లీ భవనానికి ఈ నెలాఖరులోగా టెండర్లు
* రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్ల‌డి
* 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి
* డిజైన్‌లో సీఎం చంద్రబాబు పలు సూచనలు
* వచ్చే సమావేశంలో తుది డిజైన్‌కు ఆమోదం
* 3 అంతస్తులు… 250 మీటర్ల ఎత్తులో టవర్ నిర్మాణం
* రెండు గ్యాలరీల ఏర్పాటు
* పలు సంస్థలకు అమరావతిలో భూ కేటాయింపులు
* పనులు ప్రారంభించని సంస్థలకు నోటీసులు

అమ‌రావ‌తి: అమరావతిలో నూతన అసెంబ్లీ నిర్మాణానికి ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తోంది. ఈ నెలాఖరులోగా నూతన అసెంబ్లీ భవనం డిజైన్‌ను ఆమోదించి, నిర్మాణానికి టెండర్లు కూడా పిలవాలని భావిస్తోంది. 250 మీటర్ల ఎత్తులో తిరగేసిన లిల్లీ ఫ్లవర్ ఆకృతిలో ఐకానిక్ అసెంబ్లీ భవనం నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. వెల‌గ‌పూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడుకు లండన్ నుంచి వచ్చిన నార్మన్ ఫోస్టర్స్ బృంద సభ్యులు గురువారం కలిశారన్నారు. తిరగేసిన లిల్లీ ఫ్లవర్ ఆకృతిలో ఐకానిక్ టవర్ అసెంబ్లీ భవనం డిజైన్ ను సీఎం చంద్రబాబుకు చూపించారన్నారు. డిజైన్ పరిశీలించిన సీఎం చంద్రబాబు కొన్ని సూచనలు చేశారన్నారు. చూపిన సూచనలతో తుది డిజైన్‌ను రూపొందించి తీసుకురావాలని నార్మన్ ఫోస్టర్స్ బృందానికి ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. వచ్చే సమావేశంలో డిజైన్లను ఖరారు చేసి, ఈ నెల 30 తేదీ నాటికి ఐకానిక్ టవర్ అసెంబ్లీ నిర్మాణానికి టెండర్లు పిలవనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.

250 మీటర్ల ఎత్తులో టవర్ అసెంబ్లీ భవన నిర్మాణం…
నూతన అసెంబ్లీ భవనాన్ని 250 మీటర్ల ఎత్తు మేర నిర్మించనున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఈ టవర్ లో రెండు గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నామన్నారు. 80 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసే మొదటి గ్యాలరీలో 300 మంది, 250 మీటర్ల ఎత్తులో మరో గ్యాలరీ ఉంటుందని, దాంట్లో 25 మంది నగరాన్ని వీక్షించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. నూతన అసెంబ్లీ భవనం పొడవు 200 మీటర్లు, వెడల్పు మీటర్లు ఉంటుందన్నారు. మూడు అంతస్తుల్లో అసెంబ్లీ నిర్మాణం చేపట్టనున్నామన్నారు. అమరావతి అందాలు వీక్షించేలా గ్యాలరీల చుట్టూ అద్దాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్యాలరీల్లోకి వెళ్లడానికి లిఫ్ట్ సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. తుపాన్లు, భూకంపాలు తట్టుకునేలా డిజైన్లు రూపొందిస్తున్నారన్నారు. 2 ఏళ్లలో నూతన అసెంబ్లీ నిర్మాణం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

చురుగ్గా జస్టిస్ సిటీ నిర్మాణాలు…
అమరావతిలో చేపట్టిన జస్టిస్ సిటీ నిర్మాణాలు వేగవంతంగా సాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. హైకోర్టు భవన పనులతో పాటు 4 వేల అపార్టు మెంట్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. సీఎం, గవర్నర్ బంగ్లా పనులు చేపట్టాల్సి ఉందన్నారు.

పలు సంస్థలకు భూ కేటాయింపులు…
ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ ఉప సంఘం కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. సవిత యూనివర్శిటీకి 80 ఎకరాలు, ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి 10.2 ఎకరాలు, రాజన్న ట్రస్టుకు ఎకరా, జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 2.08 ఎకరాలు, ఏపీపీఎస్సీకి 2 ఎకరాలు, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కు ఎకరా, యంగ్ మెన్స్ క్రిస్టియన్స్ అసోసియేషన్(వైఎంసీఏ)కు 2 ఎకరాలు కేటాయించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.

రెండు సంస్థలకు నోటీసులు…
అమరావతిలో భూములు కేటాయించినా పనులు ప్రారంభించిన సంస్థలకు నోటీసులు జారీచేయాలని అధికారులను మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ముందుగా ఇండో యూకే ఆసుపత్రి, బీఆర్ శెట్టీ సంస్థలకు నోటీసులివ్వనున్నామన్నారు. మిగిలిన సంస్థల ప్రతినిధులను పిలిచి మాట్లాడాలని, స్పందించకుంటే నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news