దేశంలోని అనేక రంగాల్లో స్వయం ఉపాధి పొందుతున్నవారికి కేంద్రం త్వరలో గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం కేవలం ఉద్యోగులకు మాత్రమే ఈపీఎఫ్‌వోను అందిస్తున్నారు. అది కూడా ఏదైనా ఒక కంపెనీలో 10 మంది కన్నా ఎక్కువ మంది ఉద్యోగులు ఉంటే మాత్రమే ఈపీఎఫ్‌వోలో చేరేందుకు ఇప్పటి వరకు అవకాశం ఉండేది. కానీ ఇకపై అలా కాదు. సొంతంగా పనిచేసుకునే లేదా స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా ఈపీఎఫ్‌వోలో చేరవచ్చు. అందుకుగాను కేంద్రం మార్గాలను అన్వేషిస్తోంది.
కేంద్రం స్వయం ఉపాధి పొందేవారిని కూడా ఈపీఎఫ్‌వో కిందకు తెస్తే ఎంతో మందికి లబ్ధి కలుగుతుంది. దీంతో దేశంలో మొత్తం కార్మికులు, ఉద్యోగుల్లో ఈపీఎఫ్‌వో పొందే వారి శాతం 90 కి చేరుకుంటుంది. అయితే స్వయం ఉపాధిని పొందే వారిని కూడా ఈపీఎఫ్‌వో కిందకు తెస్తే దేశంలోని లాయర్లు, డాక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు సహా సొంతంగా ఉపాధి కల్పించుకున్న, స్వయం ఉపాధి పొందుతున్న, ఇతర అందరు కార్మికులు, ఉద్యోగులకు ఎంతగానో లబ్ధి కలుగుతుంది.
కాగా ఇందుకు సంబంధించి లోక్‌సభలో సోషల్ సెక్యూరిటీ కోడ్ బిల్ పాస్ కావాల్సి ఉంటుంది. దీన్ని గతేడాది సభలో ప్రవేశపెట్టారు. అయితే త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదింపజేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. అదే జరిగితే ఎంతో మంది ఇకపై ఈపీఎఫ్‌వో పొందవచ్చు.
అయితే ప్రస్తుతం ఈపీఎఫ్‌వోకు గాను ఉద్యోగులకు బేసిక్ జీతం నుంచి 12 శాతాన్ని కట్ చేసి దానికి కంపెనీలు 13 శాతాన్ని జోడించి పీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తున్నాయి. కానీ కొత్తగా ఇతరులకు కూడా ఈపీఎఫ్‌వో వర్తింపజేస్తే వారు తమకు అందే మొత్తంలో నుంచి 20 శాతాన్ని వారే స్వయంగా పీఎఫ్ అకౌంట్‌లో జమ చేయాల్సి ఉంటుంది. అలాగే దానికి ఇతర చార్జిలు ఉంటాయి. ఈ క్రమంలో అలా పొదుపు చేసే మొత్తం పీఎఫ్ అకౌంట్‌లో ఎప్పటికప్పుడు జమ అవుతుంది. అయితే ఈ కొత్త సదుపాయం త్వరలో అందుబాటులోకి వస్తుందో, లేదో చూడాలి.