సాధారణంగా అధికార పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టాలని ప్రతిపక్షం ప్రయత్నిస్తూనే ఉంటుంది. దీనిని పట్టించుకుని, ప్రతి విషయానికీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తే.. ఏప్రభుత్వమైనా ముందుకు సాగడం ప్రశ్నార్థకమే. ఈ విషయాన్ని గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నసమయంలోనూ చెప్పుకొచ్చారు. ప్రతిపక్షం వైసీపీ అడుగడుగునా అడ్డు తగులుతోందని, అయితే, ప్రతి విషయానికీ సమాధానం ఇస్తూ పోతే.. రాష్ట్రంలో అభివృద్ది ప్రశ్నార్థకమౌతుందని, నిజానికి అభివృద్ధి సాగకూడదనే ఉద్దేశంతోనే ప్రతిపక్షం ఇలా రాజకీయాలు చేస్తోందని అనేక సందర్భాల్లో చంద్రబాబు దుయ్యబట్టారు.
ఇక, ఇప్పుడు జగన్ ప్రభుత్వం నడుపుతున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు కూడా యుద్ధం చేస్తున్నారనే చెప్పాలి. అనేక విషయాలను చంద్రబాబు నిత్యం లేవనెత్తుతున్నారు. ప్రభుత్వ వైఖరిని దుయ్యబడుతున్నారు. ఉద్యమాలు చేస్తున్నారు. ప్రతిపక్షాలను కలుపుకుని ఆందోళనలకు కూడా పిలుపునిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు కొన్నివిషయాల్లో మాత్రమే వైసీపీ సర్కారు స్పందించింది. మిగిలిన విషయాలను చూసీ చూడనట్టు వదిలేసింది. కానీ, తాజాగా మాత్రం రైతుల విషయంలో టీడీపీ నేతలు, చంద్రబాబు చేస్తున్న వ్యతిరేక ప్రచారంపై మాత్రం ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది.
తాజాగా ఆదివారం నాటి అన్ని ప్రముఖ దినపత్రికల్లోనూ జగన్ సర్కారు రైతులకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసే విషయంపై ప్రత్యేకంగా భారీ ప్రకటనలు ఇచ్చింది. సహజంగానే ఏ ప్రభుత్వమైనా చేసే ప్రతి పనికీ ప్రచారం కోరుకోవడం తెలిసిందే. ఈ విషయంలో గతంలో చంద్రబాబు, ఇప్పుడు జగన్ ఇద్దరూ ఇద్దరే. అయితే, చిత్రం ఏంటంటే.. తాజాగా ఇచ్చిన ప్రకటనలో జగన్ సర్కారు పథకం గురించి వివరించే ప్రయత్నం కన్నా.. ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలపైనే సమాధానం ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. `విష ప్రచారంపై సమాధానాలు`- జగన్ ప్రభుత్వం చేసిన ప్రకటనతో ప్రతిపక్షాల దూకుడును నిలువరించే ప్రయత్నం కన్నా కూడా ఎక్కడో చిన్నపాటి ఆందోళన ఉన్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
రైతుల విషయం సున్నితమైంది కావడం, ఓటు బ్యాంకుతో ముడిపడి ఉండడం వంటి కారణాల నేపథ్యంలో జగన్ ప్రభుత్వానికి ప్రతిపక్షాల సెగ బాగానే ఉందని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలోనే ఇప్పుడు వివరణలతో కూడిన భారీ ప్రకటనలు ఇవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఇదే కొనసాగితే.. మున్ముందు ప్రతి పధకానికీ ఇలాంటి వివరణలు తప్పవేమో! అనే సందేహం వ్యక్తమవుతుండడం గమనార్హం.
-vuyyuru subhash